గృహ నిర్మాణాల్లో సీఎం రూ.30వేల కోట్లు దోచుకున్నాడు

ఉపాధిహావిూలోనూ అవినీతి జరిగింది
వీటిల్లో అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం
పోలవరంకు చంద్రబాబుకు అసలు సంబంధమే లేదు
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రాజమండ్రి, జూన్‌15(జ‌నం సాక్షి ) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణాల్లో రూ.30వేల కోట్లు దోచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పథకాలు చంద్రబాబుకు వనరులుగా మారాయని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు నీరు-చెట్టు ఉపాధిగా మారిందని సోము వీర్రాజు అన్నారు. ఉపాధి హావిూ పథకంలో రూ.13వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. గృహ నిర్మాణం, ఉపాధి హావిూ పథకాల్లో అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని సోమువీర్రాజు తెలిపారు. చంద్రబాబులో కాంగ్రెస్‌ రక్తం పెట్టుకొని, పచ్చచొక్కా వేసుకున్నారని విమర్శించారు. పోలవరానికి చంద్రబాబుకు అసలు సంబంధంలేదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం కేంద్రం ఎంత మొత్తుకున్నా నిధిలివ్వటం లేదని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే పోలవరాన్ని కడుతున్నాన్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అండ్‌ టీం ఏపీని అవినీతిలో అగ్రస్థానంలో నిలిపేందుకు పోటీ పడుతున్నారన్నారు. నూతన రాష్ట్రంను అభివృద్ధిచేసే దమ్ము చంద్రబాబుకే ఉందని బీజేపీ సైతం చంద్రబాబుకు మద్దతు ఇచ్చిందని, కానీ చంద్రబాబు మాత్రం కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయకపోగా, తిరిగి కేంద్రంపైనే తిరగబడుతూ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని సోమువీర్రాజు హెచ్చరించారు.