గెలుపే లక్ష్యంగా పనిచేయండి

– కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయండి – సీఎల్పీ, పీసీసీ, సీఎంల సమావేశంలో రాహుల్‌న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు నిచ్చారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు (పీసీసీ), కాంగ్రెస్‌ శాసనసభపక్ష నాయకులు (సీఎల్పీ), ముఖ్యమంత్రులతో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉదయం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, ముఖ్య స్థానాల్లో ఉన్న వారు విభేదాలు విడిచిపెట్టి పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయపదంలో నడిపించే దిశగా పని చేయాలని వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి, ప్రత్యేక తెలం గాణ అంశంపై రాహుల్‌కు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ బొత్స సత్యనారాయణ వివరించారు. 2014లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌ ఈ రెండు రోజులు వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, ఎన్నికల్లో గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించి, పలు సూచనలు వేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాహుల్‌ రాష్ట్ర స్థాయి నేతలను కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఏఐసీపీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోనే పార్టీ వ్యవహారాలు చర్చించారు. మొదటి సారి నేరు గా రాహుల్‌ నాయకత్వంలో పనిచేసేందుకు వీలుగా రంగం సిద్ధం చేసేందుకే ఈ సమా వేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే అంశంపై రాహుల్‌ ప్రధానంగా దృష్టిసారించారు. జనవరిలో జైపూర్‌లో జరిగిన చింతన్‌ శిబిర్‌లో రాహుల్‌ను పార్టీ ఉపా ధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. అప్పటి నుంచే పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రాల వారీగా నెలకొన్న సమస్యలు, స్థానిక పరిస్థితులపై చర్చించేందుకు భేటిలు నిర్వహిం చాలని తలపెట్టారు. యూపీఏ రెండు సార్లు అధికారంలోకి రావడంలో కీలకభూమిక పోషించిన ఆంధ్రప్రదేశ్‌పై దృష్టిసారించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులు యేడాదిలోగా చక్కబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.