గోదావరిలో ఘోర ప్రమాదం.. పర్యాటక బోటు గల్లంతు

తూర్పుగోదావరి: పాపికొండ టూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ ప్రైవేటు బోటు గోదావరిలో మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు వేసినవారిలో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. తూటుగుంట గ్రామస్థులు పడవల్లో వెళ్లి లైఫ్ జాకెట్లు వెసుకున్నవారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. జిల్లా, స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రమాద ఘటనపై మంత్రి అవంతి ఆరా
పడవ ప్రమాద ఘటనపై పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరా తీశారు. జిల్లా ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారులతో ఫోన్‌ చేసి ఘటనకు సంభందించిన విషయాలు అడిగితెలుసుకున్నారు. పర్యాటకులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హుటాహుటిన సంఘటనా స్ధలానికి బయలుదేరి వెళ్లారు.

సీఎం జగన్‌ సీరియస్‌
తూర్పుగోదావరి జిల్లాలో లాంచి ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు  గోదావరిలో మొత్తం అన్ని బోట్లను నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులతో మాట్లాడారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు  నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫ్టర్లను సహాయక చర్యలకు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

  • దేవిపట్నం లాంచీ ప్రమాదం నేపథ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.  విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 180042500002 కి వివరాలు తెలపాలని వారి కుటుంబ సభ్యులకి కలెక్టర్ వినయ్ చంద్ విజ్ఞప్తి చేశారు.
  • తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్  1800-233-1077కి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు కోరారు.

సంఘటనా స్థలానికి సహాయక బృందాలు

బోటు మునక ప్రాంతానికి సహాయ బృందాలు వేగంగా చేరుకుంటున్నాయి. సుమారు 140మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌బృందాలు కచులూరు మందం బయల్దేరాయి. సహాయ చర్యల కోసం విశాఖపట్నం నుంచి 30మందితో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం వెళ్లింది. మంగళగిరి నుంచి మరో 30 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయల్దేరి వెళ్లాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కూడా ఘటనాస్థలానికి తరలివెళ్లింది. సహాయక చర్యల కోసం రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఘటనాస్థలికి పంపారు అధికారులు. నీటి ఉద్ధృతి, సహాయక చర్యలకు గల అవకాశాలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

7 మృతదేహాలు లభ్యం
దేవిపట్నం మండలం కచులూరుమందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం విషాదాంతమైంది. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 7మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.  లైఫ్‌ జాకెట్లు వేసుకున్నవారిలో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మొత్తం 27మందిని గ్రామస్థులు పడవల్లో వెళ్లి ఒడ్డుకు చేర్చారు. వీరంతా గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల టూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందిన వెంటనే జిల్లా, స్థానిక అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి  తరలివెళ్లారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. నిన్నటివరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది.

మా కళ్ల ముందే కొంతమంది మునిగిపోయారు : ప్రత్యక్ష సాక్షి
ప్రమాదం జరిగినప్పుడు లాంచీలో 60 మందికి పైనా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తనది వరంగల్‌ అని, తనతో పాటు 14 మంది ఇక్కడికి వచ్చామని తెలిపారు. లాంచీ పక్కకు ఒరుగుతూ నీళ్లలో మునిగిందన్నారు. ఆ సమయంలో కొంతమంది పైకి ఎక్కారని, మరి కొంతమంది తమ కళ్ల ముందే మునిగిపోయారన్నారు. ఆ సమయంలో మరో పడవ వచ్చి తమను రక్షించారని ప్రత్యక్ష సాక్షి మీడియాతో తెలిపారు.

 

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం
దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి అధికారులతో మాట్లాడారు. సహాయక కార్యక్రమాల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రమాదంలో గల్లంతైన హైదరాబాద్‌ వాసులు
గాంధీ, విశాల్‌, లక్ష్మణ్‌, జానకిరామ్‌, రాజేష్‌, రఘురామ్‌, అబ్దుల్‌ సలీమ్‌, సాయికుమార్‌, రఘురామ్‌, విష్ణుకుమార్‌, మహేశ్వరరెడ్డి కుటుంబం, ధశరథన్‌-వరంగల్‌, రమణ-విశాఖ, జగన్‌-రాజోలు

వరంగల్‌ నుంచి విహార యాత్రకు వెళ్లినవారు
ధర్మరాజు, రాజేందర్‌, వెంకటస్వామి, బస్కే దశరథం, వెంకటయ్య, ప్రసాద్‌, అవినాష్‌, దర్శనాల సురేశ్‌, సునీల్‌, అరెపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్‌, కొండూరి రాజ్‌ కుమార్‌, కొమ్మల రవిగొర్రె ప్రభాకర్‌

లాంచీలో 22 మంది హైదరాబాద్‌ పర్యాటకులు
గోదావరిలో ప్రమాదానికి గురైన బోటులో హైదరాబాద్‌కు చెందిన 22 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వరంగల్‌కు చెందిన 14 మంది కూడా ఉన్నట్లు సమాచారం. ఇక​ ఈ ప్రమాదం నుంచి వరంగల్‌ కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్‌ సహా పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. అలాగే ఎనిమిది మందికి సీరియస్‌గా ఉండటంతో వారిని ట్రాక్టర్‌లో దేవీపట్నానికి తరలిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దీగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’  అని ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు.

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినవారు వీరే
బసికె. వెంకటస్వామి (వరంగల్‌)
ఆరేపల్లి. యాదగిరి (వరంగల్‌)
గొర్రె. ప్రభాకర్ (వరంగల్‌)
దర్శనాల సురేష్ (వరంగల్‌)
బసికె దశరథం (వరంగల్‌)

ఎండీ మజ్హార్‌ (హైదరాబాద్‌)
సీహెచ్‌. రామారావు (హైదరాబాద్‌)
కె.అర్జున్‌ (హైదరాబాద్‌)
జానకి రామారావు (హైదరాబాద్‌)
సురేష్‌ (హైదరాబాద్‌)
కిరణ్‌ కుమార్‌ (హైదరాబాద్‌)
శివశంకర్‌ (హైదరాబాద్‌)
రాజేష్‌ (హైదరాబాద్‌)

గాంధీ (విజయనగరం)
మధులత (తిరుపతి)
బుసల లక్ష్మి  (విశాఖ గోపాలపురం)

వరంగల్‌ నుంచి వెళ్లినవారిలో  ఆచూకీ తెలియని వారి వివరాలు
సివి. వెంకటస్వామి
బసికె. రాజేంద్రప్రసాద్
కొండూరు. రాజకుమార్
బసికె. ధర్మరాజు
గడ్డమీది. సునీల్
కొమ్ముల. రవి
బసికె. రాజేందర్
బసికె. అవినాష్
గొర్రె. రాజేంద్రప్రసాద్

సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద బోటు ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రమాదం జరగడం దురదృష్టకరం : హరీశ్‌, కేటీఆర్‌
ఆంధప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండ టూర్ లో జరిగిన బోటు ముంపు ప్రమాదంపై తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హరీశ్ రావు భరోసానిచ్చారు. లాంఛీ ప్రమాదంపై ఏపీ మంత్రులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకునేలా సమన్వయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద బోటు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను ఆదేశించారు. దీంతో మంత్రి అజయ్ కుమార్ హుటాహుటిన కాకినాడ బయలుదేరి వెళ్లారు.