గోదావరి జలాలతో రైతులను ఆదుకుంటాం: ఎర్రబెల్లి
జనగామ,అక్టోబర్1(జనంసాక్షి): నియోజకవర్గంలోని ప్రతీ చేరువును దేవాదుల ద్వారా నింపుతామని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అందుకు రైతులు సహకరించాలని సూచించారు. తొందరపడి కాల్వలు తెంపొద్దన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలోని అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపుతానని అన్నారు. మరో రెండు రోజుల్లో గోదావరి జలాలు పాలకుర్తికి చేరుకుంటాయన్నారు. విడతల వారీగా చెరువులు నింపుతానన్నారు. ఎస్సారెస్పీ ద్వారా తొర్రూరు పెద్ద వంగర కొడకండ్ల మండలాల్లోని చెరువులు నింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నానన్నారు. వర్షాలు లేకపోవడంతో నియోజకవర్గంలోని రైతులు
సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇదే విషయం సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశానన్నారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే నీళ్లు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీంతో దేవాదుల 4ఎల్ కాల్వ ద్వారా మాధాఫురం, కడవెండి, ధర్మాపురం, దేవరుప్పుల, విస్నూరు, చెన్నూరు, మంచుప్పుల, వల్మిడి చెరువులతో పాటు కోలుకొండ, బమ్మెర గూడూరు చెరువులు నింపుతానన్నారు. గతంలో కోతులబాధ, ఈరవెన్ను, తిరుమలగిరి, అయ్యంగారిపల్లి చెరువులతో పాటు మరి కొన్ని చెరువులను గోదావరి జలాలతో నింపినట్లు చెప్పారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా దేవరుప్పుల, గుండాల మండలాల చెరువులు నింపుతామన్నారు.