గోదావరి జలాల సద్వినియోగం చేద్దాం
– ఖమ్మం జిల్లా ప్రతి ఇంచు భూమికి నీరందిద్దాం
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఆగస్ట్13(జనంసాక్షి):
ఖమ్మం జిల్లాలో సాగునీటి అవకాశాలు విరివిగా ఉన్నా సమైక్య పాలనలో ఖమ్మంలో సరైన ప్రణాళిక చేయలేకపోయారని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఓ వైపు గోదావరి, మరోవైపు మంచి వర్షాలకు అవకాశాలు ఉన్న జిల్లాగా ఖమ్మం ఉన్నా బీడు భూములు ఉండడం దారుణమన్నారు. ఖమ్మంలో భవిష్యత్ పనులపై గురువారం సిఎం సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జెడ్పీ ఛైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, కనకయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లా నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి పరచాలన్నారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సి ఉందన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో 13 లక్షల ఎకరాల భూమి సాగుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని తెలిపారు.
రూ.1800 కోట్లతో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ పనులు చేపట్టినా పెద్దగా సాగునీరు అందలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏమేరకు సాగునీరు అందుతుందో అంచనా వేయాలన్నారు. సాగుకు యోగ్యమైన మిగతా భూములకు నీరందించే విషయంపై అధ్యయనం చేయాలని సూచించారు. కిన్నెరసాని ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. సాగునీటి సౌకర్యంలేని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, అర్బన్, కామెపలి, కారేపల్లి, టేకులపల్లి, ఏలేరుపాడు, జూలూరుపాడు, ముల్కలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి మండలాలకు నీరందించే అంశంపై దృష్టి పెట్టాలని అన్నారు. పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు గోదావరి నీటిని అందించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని కోరారు.
దేవాదాయ ఉద్యోగులకు పదో పిఆర్సీ
దేవాదాయశాఖ ఉద్యోగులకు శుభవార్త. దేవాదాయశాఖ ఉద్యోగులకు పదవ పీఆర్సీని వర్తింపజేసే అంశంకు సీఎం కేసీఆర్ ఆమోదం లభించింది. ఈమేరకు ఆయన ఇందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. నేడో రేపో జీవో విడుదల కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 370 ఆలయాల్లో పనిచేస్తోన్న 2,365 మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది.