గోవాలో కాంగ్రెస్‌కు భారీ షాక్
కాషాయ పార్టీలో చేరనున్న కీలక నేత!
పనాజీ,డిసెంబర్7 (జనంసాక్షి) : కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్న క్రమంలో గోవాలో మరో సీనియర్ నేత పార్టీని వీడారు. వచ్చే ఏడాది ఆరంభంలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో మాజీ సీఎం, పార్టీ ఎమ్మెల్యే రవి సీతారాం నాయక్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. పోండా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రవి సీతారాం నాయక్ గోవా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి తన రాజీనామా లేఖ సమర్పించారు. మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో రవి నాయక్ బీజేపీలో చేరతారని భావిస్తున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక నేత చేరిక కాషాయ పార్టీలో జోష్ నింపుతోంది. మరోవైపు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ, కేజీవ్రాల్ నేతృత్వంలోని ఆప్ సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత సోమవారం టీఎంసీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరపడేకొద్దీ పలు పార్టీల నుంచి వలసలు ఊపందుకుంటాయని చెబుతున్నారు.