గోసంరక్షణ పేరుతో దాడులు సరికావు

– వీటిపై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలి
– కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం
న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : గో సంరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న దాడులను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ఇలా దాడి చేయడం సరైనది కాదని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాడులకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. గత కొంతకాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆవుల సంరక్షణ పేరుతో దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ కొందరు గో సంరక్షణ కార్యకర్తలు వ్యక్తులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. దీంతో ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్‌ పూనావాలా, మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘భయం, అరాచకత్వం వంటి ఘటనల్లో రాష్ట్రాలు సానుకూలంగా స్పందించారు. హింసను అనుమతించకూడదు. రక్షణ పేరుతో గుంపుగా దాడి చేయడం ఎంతమాత్రం సరికాదని, వీటిని అరికట్టడం రాష్ట్రాల బాధ్యత. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్‌ ఓ ప్రత్యేక చట్టాన్ని తయారుచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.