గ్రామజ్యోతిపై మంత్రి వర్గ ఉపసంఘం కసరత్తు

3

హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి):

గ్రామజ్యోతి కార్యక్రమానికి విధివిధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఉపసంఘం ఇవాళ తొలిసారిగా సమావేశమైంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతికి సంతాపం ప్రకటించిన మంత్రులు? రెండు నిముషాలు మౌనం పాటించారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభించాల్సిన గ్రామజ్యోతి కార్యక్రమం విధివిధానాలపై మంత్రులు చర్చించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీలకు అప్పగించాల్సిన బాధ్యతలు, చేపట్టాల్సిన పనులకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. గ్రామస్థాయిలో వివిధ శాఖల పరంగా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ జవాబుదారీతనం లేకుండా పోయిందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. శాఖల మధ్య సమన్వయంతో పాటు ప్రాధాన్యాల గుర్తింపు గ్రామస్థాయిలోనే జరిగేలా కసరత్తు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం, పంచాయతీలకు జవాబుదారీతనం లక్ష్యంగా విధివిధానాలను రూపొందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించిన ప్రణాళికల ఆధారంగానే నిధులు ఖర్చు చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు.

మహిళా సంక్షేమం, దళిత సంక్షేమం, పౌర సరఫరాలు, విద్య, వైద్య, అటవీ శాఖలపై తొలిరోజు సవిూక్ష నిర్వహించారు. రేపు మిగతా శాఖల సవిూక్షతో పాటు జెడ్పీ ఛైర్మన్లు, పంచాయతీరాజ్‌ సంస్థల ప్రతినిధులతోనూ ఉపసంఘం చర్చించనుంది.

ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌ తో పాటు ఈటెల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.