గ్రామాల అభివృద్దిలో సర్పంచ్‌లే కీలకం
ఆదిలాబాద్,మార్చి1(జనంసాక్షి): గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచ్‌లు ఇక కార్యక్షేత్రంలోకి దిగాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో అమలు చేసి అభివృద్దికి దోహదపడాలన్నారు. జిల్లా కేంద్రంలోని యువజన శిక్షణ కేంద్రంలో ఇటీవల గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తద్వారా గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, ఉపాధిహావిూ పథకం కింద ఇంకుడు గుంతల తవ్వకం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వాటిపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలన్నారు. గ్రామాల్లోని ట్రైసైకిళ్లను బాగు చేయించి ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించే విధంగా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇప్పటికే నిధులు వచ్చాయని, నిర్మాణాలను వేగవంతం చేసి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు అధికార యంత్రాంగం కేడా తమవంతు సహకారం అందిస్తుందని అన్నారు.