గ్రామాల అభివృద్ది జరగలేదు: సునీత

మెదక్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. సునీతారెడ్డి ఎన్నికల ప్రచారం ఆరంభించే ముందు శివం పేట మండలం దొంతి గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిసారి ప్రచారానికి వెళ్లే ముందు ఈ దేవాలయంలో పూజలు చేసి ప్రారంభించడం ఆమెకు ఆనవాయితీ. పూజా కార్యక్రమాలు పూరైన తరువాత దొంతి గ్రామం నుంచి ఆమె ప్రచారం మొదలుపెట్టారు. చేతి గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు యాదా గౌడ్‌, నాయకులు లక్ష్మీ కాంతరావు, హరిశంకర్‌ గౌడ్‌, ఎం.డి. లాయక్‌, శ్రీనివాస్‌, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.