గ్రామాల అభివృద్ది నిరంతర ప్రక్రియ
30రోజుల ప్రణాళికతోనే ఆగదు
కలెక్టర్ కర్ణన్
ఖమ్మం,సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : 30రోజుల కార్యాచరణ ప్రణాళిక కేవలం నెల రోజులకే పరిమితం కాదని నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిదుల సహకారంతో నిబద్ధతతో పనిచేసి ఖమ్మం జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.30 రోజులలో గ్రామాలలో జరిగిన ప్రణాళిక అమలుకోసం సీనియర్ అధికారుల నేతృత్వంలో ప్లయింగ్ స్కాడ్‌లు గ్రామాలలో ఆకస్మిక తనిఖీలు చేపడ్తా యన్నారు.అజాగ్రత్త, అలసత్వం ప్రదిర్శంచిన వారిపై చర్యలు తీసుకుంటారని కలెక్టర్ అన్నారు.అదేవిధంగా లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహాకాలను అందించడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్‌కు పలు విశిష్ట అధికారాలు, విలువలు కల్పించారని కలెక్టర్ కర్ణన్ అన్నారు. గ్రామసభ తీర్మానం ద్వారా గ్రామాభివృద్ధి పనులు చేపట్టే నిర్ణయాధికారులు కల్పించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రూపొందించిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ అమలుపై సర్పంచ్‌లు తమ గ్రామాలను తామే అభివృద్ది చేసుకునే విధంగా పనులను గుర్తించి ప్రణాళికలను రూపొందించుకొని తదనుగుణంగా పనులు చేపట్టాలన్నారు.గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ జనాభా నిష్పత్తి ప్రకారం నిధులను విడుదల చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి పది శాతం నిధులను తప్పనిసరిగా హరితహారానికి వినియోగించాలని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. ఎన్‌ఆర్‌జీఎస్ నిధులను కూడా పూర్తిగా సర్పంచ్ నియంత్రణలోకి మార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రత్యేక అధికారులు, గ్రామ ప్రజలు పూర్తిగా గ్రామాలలో పాదయాత్ర నిర్వహించి గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించాలన్నారు. డంపింగ్ యార్డులు, శ్మశానవాటికోసం ప్రభుత్వ స్థలాలను అప్పగిస్తామని, ప్రభుత్వ స్థలాలు లేని చోట ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసే అధికారాలను కూడా గ్రామ
పంచాయతీలకు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలవని, మనం వినియోగించే నీరు , ఇంట్లోని నీటి నిల్వల ద్వారా దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతాయని వాతావరణ మార్పులవల్ల సంభంవించే వ్యాధుల
పట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీలలో గ్రామ సభల ద్వారా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశిరచుకొని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ తప్పనిసరిగా ఉండాలన్నారు.ప్రతి ఇంటికి కనీసం ఆరు మొక్కలు గృహ అవసరాలకు ఉపయోగపడే పండ్ల, ఔషధ మొక్కలను పంపిణీ చేయాలన్నారు.ఈ సందర్భంగా సదస్సు కు హాజరైన వారికి కార్యాచరణ ప్రణాళిక అమలుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారి రాంబాబు అవగాహన కల్పించారు.