గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి
– రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన వెల్లడి
మెదక్, జూన్ 27 : రోడ్ల అభివృద్ధిలో భాగంగా తొగుట, దుబ్బాక మండలాల నుంచి సిద్దిపేట పట్టణానికి వెళ్లడానికి ఎలాంటి అవంతరాలు లేకుండా చక్కటి రోడ్డును నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలోని తొగుట మండలంలోని వెంకట్రావుపేట, తుక్కాపూర్ గ్రామాలలో పర్యటించారు. వెంకట్రావుపేట గ్రామములో కూడవెళ్లి వాగుపై రూ.2.40 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. అనంతరం తుక్కాపూర్ గ్రామములో రూ.కోటితో నిర్మించబోయే బ్రిడ్జికి మంత్ర శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పరిపాలన పారదర్శకంగా సాగుతున్నదని, హోంగార్డు నుంచి ఎస్సై వరకు, గ్రామ పరిపాలనాధికారి నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారి వరకు నియమించే నియమాకాలలో పారదర్శకంగా ఎవరూ వేలు ఎత్తి చూపకుండా నియమాకాలు చేయడం జరిగిందని, ఇది గత 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం సాధించిన విజయమని అన్నారు. పంచాయితీరాజ్ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదిలీ చేసిన వేల కిలో మీటర్ల రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కోరుకునే విధంగా గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అన్ని రోడ్లను మెరుగుపర్చడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.