గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుపూర్తి
9 సెంటర్లలో 2373 మందికి పరీక్షలు
ఉదయం 10.15 ల తదుపరి అనుమతించరాదు
ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు
ఫోటో గుర్తింపు కార్డులు లేని సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో లోనికి అనుమతించరాదు
అధికారులకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం
భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 11 (జనంసాక్షి):ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని,పరీక్షలను పారాదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గ్రూప్1పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పై మంగళవారం కలెక్టర్ చాంబర్ లో గ్రూప్1 పరీక్ష కేంద్రాల పర్యవేక్షకులు, లైజన్ అధికారులు, అధికారులు, రూట్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నియమ నిభందనల ప్రకారం నిర్వహించాలని , పరీక్షల విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని, పరీక్షా కేంద్రాలలో సిటింగ్, రూమ్స్ లేఔట్ వివరాలు నోటిస్ బోర్డ్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో గ్రూప్1 పరీక్షలకు 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 16 ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని, అధికారులు, పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష కేంద్రాలలో అవసరమైన కుర్చీలు ,బెంచీలు తదితర మౌలిక వసతుల ఏర్పాట్లను సరి చూసుకోవాలని, సిబ్బంది అందరికీ ఫోటో గుర్తింపు కార్డులు జారీచేయాలని, గుర్తింపు కార్డులు లేనివారిని ఎట్టి పరిస్తితిలో లోనికి అనుమతించరాదని తెలిపారు.పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 9 పరీక్ష కేంద్రాలను కలిపి 3 రూట్లు గా విభజించడం జరిగిందని, దీనికి రూట్ అధికారులుగా సీనియర్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండ పోలీసు అధికారులు 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని , ఎలాంటి కాపీ జరగకుండా తనిఖీ లు చేయాలని, పరీక్ష నిర్వహించే 16వ తేదీన అన్ని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని, ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద నియమ నిభందనలు తెలిపే విదంగా ఫ్లెక్సిలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పరిక్ష కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితులలో మొబైల్ ఫోన్లు, ఎలెక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులను, పుస్తకాలను అనుమతించవద్దని ,పరీక్ష నిర్వహించే రోజు విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తరఫున ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాలఆవరణ లోకి ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియాకు అనుమతి లేదని తెలియచేసారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ టీఎస్ దివాకర,అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డిఓ శ్రీనివాస్, డిఎస్పీ రాములు, ఏ.ఓ. మహేష్ బాబు, పరీక్ష కేంద్రాల పర్యవేక్షకులు, జిల్లా అధికారులు, లైజన్ ఆఫీసర్లు, సహాయ లైజన్ ఆఫీసర్లు, తాహసిల్దార్లు, ఎంపీడీవో, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.