గ్వాటెమాలో బద్దలైన అగ్నిపర్వతం

 

25మంది సజీవదహనం

నదిలా ప్రవహిస్తోన్న లావా

విమానాశ్రయం మూసివేత

సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

గ్వాటెమాలా సిటీ,జూన్‌4(జ‌నం సాక్షి): గ్వాటెమాలాలో ఘోర ప్రమాదం సంభవించింది. సెంట్రల్‌ అమెరికాలోని గ్వాటెమాలలో ఫ్యూగో అగ్ని పర్వతం పేలింది. దీంతో లావాలో చిక్కుకొని 25 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిపర్వతం బద్దలవడంతో ఆ లావాలో చిక్కుకుని 25 మంది సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. గ్వాటెమాలా జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్‌ అమెరికా ప్రాంతంలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఫ్యూగో అగ్నిపర్వతం ఆదివారం బద్దలైంది. దీంతో పెద్ద పెద్ద రాళ్లు ఎగిరి పడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిపర్వతం నుంచి లావా ఎగసిపడి సవిూపంలోని గ్రామాల వరకు వ్యాపించింది. ఈ లావాలో పలువురు స్థానికులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది మృతిచెందగా.. మరో 20మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఎల్‌ రోడియో గ్రామంలోని ఓ ఇంటిపై పడటంతో మంటలు తలెత్తాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. వీరిలో విపత్తు ఏజెన్సీకి చెందిన అధికారి

కూడా ఉన్నారు. ఇక మరో ఇద్దరు చిన్నారులు వంతెనపై నిల్చుని ఉండగా లావా పడి మృతిచెందారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అగ్నిపర్వతం సవిూపంలోని గ్రామాలకు చెందిన 2వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద సముద్రమట్టానికి 12,346 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతోంది. దీంతో గ్వాటెమాలా సిటీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గ్వాటెమాలాలో ఈ ఏడాది బద్దలైన అగ్నిపర్వాతాల్లో ఇది రెండోది. ఇంకా రెండు అగ్నిపర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నదిలా ప్రవహిస్తున్న లావా చుట్టుపక్కల ప్రాంతాలను దహించి వేసింది. ఆకాశంలో పది కిలోవిూటర్ల ఎత్తున దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. రాత్రి ఒక్కసారిగా ఈ అగ్నిపర్వతం పేలడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ అగ్ని పర్వతం పేలుడు కనీసం 17 లక్షల మందిపై ప్రభావం చూపనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ ధ్వంసమయ్యాయి. మొత్తం లావా, బూడిదతో నిండిపోయాయి. అగ్ని పర్వతానికి 40 కిలోవిూటర్ల దూరంలో ఉన్న ఎయిర్‌ పోర్ట్‌ రన్‌ వే పైకి కూడా ఈ బూడిద చేరడంతో దాన్ని మూసివేశారు.

——–