ఘోరం..మేడపై బాలిక దుస్తులు తీస్తుండగా..

నిజామాబాద్‌ : నగరంలోని సంతోష్‌నగర్‌లో విద్యుదాఘాతంతో ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఇంటి దాబా పైన ఆరేసిన బట్టలు తీస్తున్న సమయంలో సర్వీసు వైరుతో ఉన్న జాయింట్‌ తీగ తగలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 5వ ఠాణా ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. నగరంలోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉండే బమ్మిలకొండ ఉమారాణి(12) అనే బాలిక మానిక్‌భవన్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఉండగా దాబాపైన ఆరేసిన బట్టలు తీసుకరావాలని పెద్దలు సూచించారు. దీంతో పైకి వెళ్లి బట్టలు తీస్తుండగా ఇంటికి విద్యుత్‌ సరఫరా అందే సర్వీసు వైరుకి ఉన్న జాయింట్‌ తీగ తగిలింది. ఆ తీగ వెంబడి విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో వెంటనే షాక్‌ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఉమారాణి అక్కడే కుప్పకూలింది. శబ్దానికి పైకి వెళ్లి బాలికను రక్షించబోయిన సోదరుడు దేవరాజుకి సైతం షాక్‌ తగిలినా ఎలాంటి హాని జరగలేదు. అయితే బాలిక మాత్రం సంఘటనాస్థలంలోనే మృతి చెందింది. బాలిక దుర్మరణంతో కుటుంబీకులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఐదో ఠాణా ఎస్సై శ్రీహరి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.