చండీయాగంలో పాల్గొన్న బాబు…
ఎర్రవల్లిలో జరుగుతున్న అయుత చండీమహాయాగానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబుకు.. డిప్యూటీ సీఎం కడియం, మంత్రులు హరీష్రావు, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బాల్క సుమన్ తదితరులు స్వాగతం పలికారు. యాగశాల దగ్గరకి తోడ్కొని వెళ్లారు. పూర్ణకుంభంతో వేదపండితులు ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.ఏపీ సీఎం చంద్రబాబు పసుపు వర్ణం దుస్తులు ధరించి చండీయాగంలో పాల్గొన్నారు. రుత్విక్కుల మంత్రోచ్ఛరణాల మధ్య యాగం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ నుంచి తీసుకువచ్చిన పట్టు వస్ర్తాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని యాగశాలలో చంద్రబాబు సమర్పించారు. అంతకుముందు యాగశాల చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేశారు. ఇక యాగం గురించి చంద్రబాబుకు సీఎం కేసీఆర్ వివరించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. చంద్రబాబుతోపాటు నేతలందరూ.. సాంప్రదాయ దుస్తులతో హోమంలో పాల్గొన్నారు. చంద్రబాబు వెంట తీసుకొచ్చిన విజయవాడ కనకదుర్గ అమ్మవారి చీర, కుంకుమ, ప్రసాదాన్ని అందచేశారు. జ్ఞాపికను బహుకరించారు. అటు చంద్రబాబును సత్కరించిన సీఎం కేసీఆర్ అమ్మవారి విగ్రహాన్ని బహుకరించారు. తర్వాత ఏపీ నేతలందరినీ సీఎం కేసీఆర్ సన్మానించారు. యాగ విశేషాలను సీఎం కేసీఆర్ చంద్రబాబుకు వివరించారు.