చండీయాగం అధికారదుర్వినియోగం

2
– తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్‌,డిసెంబర్‌23(జనంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తూ, చండీ యాగం నిర్వహిస్తున్నారని  యాగ నిర్వహణ వ్యక్తిగతం అని చెబుతూనే , రాజ్యాంగ వ్యవస్థలను తన ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆయన అన్నారు.. ముఖ్యమంత్రి రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదని అన్నారు. ప్రభుత్వం కుల మత భావాలు ప్రేరేపించే చర్యల్ని ప్రోత్సహించకూడదని, లౌకికతత్వాన్ని కాపాడటం పాలకుల బాధ్యత అని చెప్పారు. కేసీఆర్‌ వ్యక్తిగత పూజకు పరిమితం కాకుండా, రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి, ఇతర ప్రభుత్వ నేతలందర్నీ భాగస్వాముల్ని చేస్తున్నారని అన్నారు. ఖర్చు తానే భరిస్తున్నానని చెప్పడం వట్టి బూటకమని, యాగ స్థలం తప్ప ఏదీ ఆయన సొంతం కాదని అన్నారు. యాగ క్షేత్రంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది దగ్గరుండి పనులు చేయిస్తున్న విషయాన్ని విస్మరించరాదని వీరభద్రం పేర్కొన్నారు. ఆహ్వానపత్రాలు ఇవ్వడానికి హెలికాఫ్టర్లు వాడారని, ఆ ఖర్చు ఎవరు భరించారని ఆయన అన్నారు. ఖర్చులన్నీ భారీగా పెడుతూ సొంతంగా పెడుతున్నానని అనడం ఎంతవరకు నిజమో చెప్పాలన్నారు. ఇంతగా అధికా యంత్రాంగాన్ని వృధా చేయడం దారుణమన్నారు.