చంద్రబాబును కలిసిన ప్రజాసంఘాల నేతలు

హైదరాబాద్‌ : తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆయన నివాసంలో కలిశారు. మహానాడులో తెలంగాణపై మరోసారి తీర్మానం చేసినందుకు వారు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో దొరల రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానివ్వమని నేతలు చెప్పారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. డబ్బున్న వాళ్లకే టిక్కెట్లు ఇస్తున్న కేసీఆర్‌ నిజమైన ఉద్యమకారులను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. తెరాసను టీడీపీలో విలీనం చేసేందుకు హరీశ్‌ రావు పెట్టిన షరతులపై చంద్రబాబుతో చర్చించినట్లు ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్‌ గజ్జెల కాంతం తెలిపారు. సోనియా కనుసన్నల్లో కేసీఆర్‌ నడుస్తున్నారని విమర్శించిన ఆయన కాంగ్రెస్‌, తెరాసలు ఒక్కటై తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నాయని విమరించారు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెడితే, టీడీపీ ఎంపీలంతా అనుకూలంగా ఓటు వేసేందుకు చంద్రబాబు హామీ ఇవ్వటంతో పాటు 2014లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేసేందుకూ చంద్రబాబు అంగీకరించారని గజ్జెల కాంతం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తెలుగుదేశం అధికారంలోకి వస్తే …. మోత్కుపల్లి లేదా కె. ఎస్‌. రత్నంలను సీఎం చేసేందుకూ చంద్రబాబు సరేనన్నుట్లు చెప్పారు.