చంద్రబాబుపై బాంబు దాడి కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష
మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
చిత్తూరు, నవంబర్ 8 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్1న జరిగిన బాంబు దాడి కేసులో ఇద్దరు నింధితులకు నాలుగవ అదనపు సేషన్స్ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. మరో ఇద్దరిపై సాక్షాధారాలు లేనంటూ వారిని నిర్దోషులుగా ప్రకటించింది. చిత్తూరు జిల్లా అలిపిరి వద్ద చంద్రబాబుపై బాంబు దాడి కేసులో రామస్వామి, నాగార్జునరెడ్డి అనే ఇద్దరి నిందితులకు తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి ఈశ్వరరావు ఏడేళ్ల జైలు శిక్షను విధించారు. మరో ఇద్దరు నింధితులు సాగర్, గంగిరెడ్డిలపై ఆధారాలు లేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా చెబుతూ విడుదల చేసింది. ఈ కేసులో శిక్ష పడిన, నిర్దోషులుగా పేర్కొన్న నలుగురిలో సాగర్ ఒక్కడే మాజీ మావోయిస్టు నేత. మిగిలిన ముగ్గురు బాంబు దాడిలో మావోయిస్టులకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే సాగర్, గంగిరెడ్డిలను దోషులుగా తేల్చేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చింది. 2004లో దీనిపై ఛార్జీషీటు నమోదైంది. 33 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. అందులో 28 మందిని గుర్తించలేకపోయారు. మిగిలిన ఐదుగురిలో కేసు విచారణలో ఉండగా ఒకరు మృతి చెందారు. నలుగురిలో ఇప్పుడు ఇద్దరికి శిక్ష పడగా మరో ఇద్దరికి విముక్తి కలిగింది.