చంద్రబాబు పాలనలో క్షీణించిన శాంతిభద్రతలు
పోలీసులను అడ్డు పెట్టుకుని బెదరింపు రాజకీయాలు
కేంద్ర నిధులపై విచారణ జరిపించే దమ్ముందా
విజయవాడలో బిజెపి మహాధర్నా
బాబు తీరుపై మండిపడ్డ అధ్యక్షుడు కన్నా
విజయవాడ,జూన్11(జనం సాక్షి): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు తన ప్రత్యర్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగాధర్నాచౌక్‌లో భారతీయ జనతా పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో కన్నాతో పాటు మాజీ మంత్రి మాణిక్యాలరావు, విష్ణుకుమార్ రాజు, సురేష్ రెడ్డి, రమేష్ నాయుడులు,పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని కన్నా ఆరోపించారు. టీడీపీలో చేరకపోతే కేసులు బెడతామంటూ పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పోలీసులు దమన కాండ సాగిస్తున్నారని, అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖాకీ డ్రెస్ వేసుకొని పచ్చ జెండా కింద పని చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అలిపిరిలో అమిత్ షాపై రాళ్లదాడి చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే బీజేపీ కార్యకర్తలపై ఎదురు కేసులు పెట్టారని కన్నా ధ్వజమెత్తారు. గతంలో సోము వీర్రాజు ఇంటిపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారని గుర్తుచేశారు. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో సీఎం పర్యటన సందర్భంగా, బీజేపీ నేతలను గృహనిర్భందం చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. టీడీపీ పాలనలో నియంతృత్వ ధోరణి పెరిగిపోయిందని మండిపడ్డారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు మోసాలను, మాయమాటలను ప్రజలకు వివరిస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు, కేంద్రం ఇస్తోన్న నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా? అని కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. తెదేపా ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాత ఎన్టీఆర్‌ని, ఇప్పుడు నరేంద్రమోడీని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రన్న బీమాకు కేంద్రం నిధులిస్తుంటే ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నారని, గృహ నిర్మాణ పథకాలకు మోడీ సర్కారు డబ్బులిస్తుంటే ప్రచారం మాత్రం చంద్రబాబు చేసుకుంటున్నారని కన్నా విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల నుంచి కేంద్రం నిధులిస్తుంటే వాటిని దారి మళ్లించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆరోపించారు. చంద్రబాబుకు ధైర్యముంటే ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్దికోసం బీజేపీపై బురదజల్లుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తామని మాజీ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో అనేక శాఖల్లో యథేచ్ఛగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్నారు. ఏపీకి కేంద్రం ఎంతో సాయం చేసినా చంద్రబాబు తన గొప్పలు చెప్పుకుంటున్నారని మాణిక్యాలరావు మండిపడ్డారు. ఇసుక, భూ కుంభకోణాల్లో టీడీపీ ప్రభుత్వం కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. పట్టిసీమలో 30 పంపుసెట్లకు గాను 2 పంపుసెట్లే పెట్టి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. విశాఖ భూముల అవకతవకలపై సిట్ వేసి విచారణ జరిపారని, ఆ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. విశాఖకు రైల్వేజోన్ వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్ వస్తుందని విష్ణుకుమార్‌రాజు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోంటే ఆ ప్రాజెక్టు నిర్మాణ ఘనత తమదిగా తెదేపా ప్రభుత్వం చెప్పుకోవటం సిగ్గుచేటని భాజపా మహిళా నేత దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. రాష్ట్రంలో భాజపా నేతలపై జరుగుతున్న దాడులను ఇకనైనా ఆపాలని హెచ్ఛరించారు. ఈ కార్యక్రమంలో భాజపాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.