చంద్రబాబు పై మండిప‌డ్డ‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు కాకాణి

 నెల్లూరు(జ‌నం సాక్షి ) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాకాణి ఆదివారం ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌ సీపీకి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని గోల పెడుతున్నారు, ఇందులో భాగంగానే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అమిత్‌ షాను కలిశారనే ప్రచారం చేశారు. చివరకు ఆధారాలు లేక.. రామ్‌మాధవ్‌ను కలిసినట్లు మరో కట్టుకథ చెప్పే ప్రయత్నం చేశార’ని అన్నారు.చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని, అందుకే ఢిల్లీలో బుగ్గన ఎదో చేశారని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని కాకాణి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, తమ పార్టీ ఎదుగుదల చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారంటూ విమర్శించారు. బుగ్గనసై మంత్రి యనమల చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధమని సవాల్‌ విసిరారు. అధికారిక సమాచారాన్ని రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఏ వానకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హోదాను తాకట్టి పెట్టి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారం​టూ మండిపడ్డారు.చంద్రబాబు అవినీతి గురించి ప్రశ్నిస్తుంటే ఏం చేయాలో పాలుపోక బీజేపీతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం వారి నీచ రాజకీయానికి పరాకాష్ట అని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్‌ను చంద్రబాబు సలహాదారుగా ఎలా నియమించుకున్నారని ప్రశ్నించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారని చెప్పుకునే బాబు, మహారాష్ట్ర మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఎలా ఇచ్చారంటూ కాకాణి నిలదీశారు. సుజనా చౌదరి నిత్యం కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ చుట్టూనే తిరుగుతున్నారంటూ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని కాకాణి అన్నారు.