చంద్రబాబు రక్తదాహానికి పన్నెండేళ్లు
మొన్న అంటే.. ఆగస్టు 27, 2012 నాడు టీడీపీ నాయకులు కరెంటు కోతలు, రైతు సమస్యలను పరిష్కరించాలని సీఎం కిరణ్‌ను కలిశారు. ఆయన తమతో సరిగ్గా వ్యవహరించలేదని అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి టీడీపీ బ్యాచ్ నిరసన తెలుపుతూ, అరెస్టయ్యారు. ప్రజల దృష్టిలో హీరోలయ్యి, మళ్లీ తమ ‘బాబు’ను గద్దెనెక్కించాలని శాయశక్తులా కృషి చేశారు. తమపై దౌర్జన్యం చేస్తున్నదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘న్యాయం అడిగితే అరెస్టు చేస్తారా..’ అంటూ లేని ఉత్సాహం తెచ్చుకుని, గొంతులు చించుకుని అరిచారు. కానీ, ఇక్కడ వారొక్క విషయం మరిపోయారు. సరిగ్గా పన్నెండేళ్ల కిందట వాళ్ల నాయకుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తాను సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే న్యాయం అడిగిన సామాన్య ప్రజలను చంపమని ఆదేశించాడు. తన రక్తదాహాన్ని తీర్చుకున్నాడు. ఇంకా నయం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా బాబు కన్నా తక్కువేం కాదు. వీళ్లకు కూడా నాడు ‘బాబు’ వచ్చిన ఆలోచన వచ్చుంటే..!
అవును.. చంద్రబాబు సీఎం ఉన్న కాలంలో సరిగ్గా పన్నేండేళ్ల కిందట తాను పారదర్శక పాలనను అందిస్తానని చేసిన వాగ్దానాన్ని మరిచి, నరరూపపాలకుడిగా అవతారమెత్తి, నరబలి కావాలని ఖాకీలను ఆదేశించాడు. ఆ రోజు ఆగస్టు 28, 2000. ప్రజాస్వామ్య దేశంలో పాలకులు ఇలాంటి దాష్టీలకు పాల్పడుతారా ? ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే కాల్పులకు తెగబడుతారా ? నిరంకుశంగా లాఠీలతో ప్రజలను చితకబాదుతారా ? గుర్రాలతో తొక్కిస్తారా ? అంటూ సామాన్య జీవుడు బిక్కుబిక్కుమంటూ విస్తుపోయిన తారీఖును రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువరు. అంతటి దారుణం ఆ తారీఖున జరగడానికి పరోక్షంగా ‘కర్త.. కర్మ.. క్రియ’ అయి నడిపించిన వాడు చంద్రబాబు. ఆ రోజు ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు తలొగ్గి చంద్రబాబు నేతృత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమపై మోపిన విద్యుత్ భారాన్ని తగ్గించాలంటూ సామాన్య ప్రజలు, రైతులు వాపపక్షాల నాయకత్వంలో నిరసన తెలిపారు. ఈ నిరసనకు ‘చలో సెక్రెటేరియట్’ పేరిట హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బషీర్‌బాగ్ చేరుకోగానే ‘బాబు బలగాలు’ పోలీసుల అవతారంలో వారికి ఎదురుపడ్డాయి. అయినా, తమపై పడుతున్న భారాన్ని తమ పాలకుడికి తెలిపి, న్యాయం పొందాలన్న కృత నిశ్చయంతో ప్రజలు ముందుకే సాగారు. కానీ, వారు ఊహించింది వేరు.. బషీర్‌బాగ్‌లో జరిగింది వేరు. దాదాపు 25 వేల మందితో భారీగా కదులుతున్న ఆ జనసంద్రంపై అకస్మాత్తుగా గుండ్ల వర్షం కురిసింది. గాంధేయ మార్గంలో ప్రదర్శన జరుపుతున్న సగటు జీవులు ఆ ప్రాంతంలో నెత్తురోడారు. ఈ మారణకాండలో ముగ్గురు మృత్యువాత పడగా, 26 మంది అంగవికలురయ్యారు. 25 మందికి గుండ్ల గాయాలవగా, వందలాది మంది తొక్కిసలాటలో ఇరుక్కుని గాయపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు అమృత్‌సర్‌లో డయ్యర్ నేతృత్వంలో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండను చంద్రబాబు బషీర్‌బాగ్ సంఘటనతో మరిపించాడని మానవతావాదులు, మానవ హక్కుల సంఘాలు విమర్శలు చేశాయి. అయినా, నిరంకుశ బాబు హృదయం కరగలేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా పశ్చాత్తాప పడుతున్నట్లు ఎన్నడూ ప్రకటించలేదు. ఆ ఊచకోతలో మరణించిన వారికి గానీ, గాయపడ్డ వారికి గానీ బాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఆనాటి నిరసనకు తన సంపూర్ణ మద్దతు తెలిపిన వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘటన సమయంలో మెల్లగా జారుకున్నాడు. పన్నెండేళ్ల తాను వేసిన విద్యుత్ భారం అనే బీజాన్ని నేటి సీఎం కిరణ్ నీళ్లు పోసి మహావక్ష్లాన్ని చేస్తున్నాడు. నాడు రక్తపుటేరులు పారించిన ‘చంద్రబాబు అండ్ కో’ ఇప్పుడు తాము చేసిన తప్పుపై తామే పోరాడుతున్నట్లు నటిస్తూ జనాలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలారా.. ఇదే రాజకీయం ! అని తెలుసుకోండి. ‘బాబు’ గారితో జర భద్రంగా ఉండండి !