చంద్లాపూర్‌కు అరుదైన గౌరవం

దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా గుర్తింపు
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రపంచ స్థాయిలో ఘనత
గొల్లభామ చీరలు సహా ప్రత్యేకమైన చేనేత రకాలకు ప్రసిద్ధి
సిద్దిపేట జిల్లావాసులు, గ్రామస్తుల హర్షం
సిద్దిపేట, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి):సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్‌ గ్రామం దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా అరుదైన ఘనత సాధించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని చిన్న గ్రామీణ ప్రాంతాన్ని ప్రాంత ప్రత్యేకత, వివిధ రంగాలలో సాధించిన విజయాలను పరిగణలోనికి తీసుకొని ఎంపిక చేసింది. 4500 జనాభా ఉన్న ఈ గ్రామం అరుదైన చేనేతకు ప్రసిద్ధి చెందింది. వైవిధ్యమైన గొల్లభామ చీరలతో సహా ప్రత్యేకమైన చేనేత రకాలను కలిగి ఉన్న ఈ గ్రామం పురాతన, సాంప్రదాయ చేనేత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది.ఈ గ్రామం గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన రంగనాయకస్వామి ఆలయ పరిధిలో ఉంది. గ్రామం నలువైపులా కోమటి చెరువు సరస్సు, వర్గల్‌ సరస్వతి దేవాలయం, చేరియాల నకాషి పెయింటింగ్‌ క్లస్టర్‌ తో ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ గ్రామీణ ప్రాంతంలోనే పర్యాటక ఆకర్షణలలో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం కూడా ఉండడం విశేషం. సాంస్కృతిక పరంగా ఈ గ్రామంలో దేవాలయాలు, మసీదులు, చర్చిల వంటి పురాతన మతపరమైన ఆకర్షణలకు ప్రసిద్ధిగాంచడం తో పాటు ఈ ప్రాంతంలో సాంస్కృతిక వనరులు, ఐకానిక్‌ హస్తకళలు సాంప్రదాయ వైభవం ప్రతిబింబిస్తాయి. రంగనాయక స్వామి దేవాలయం మానసిక,శారీరక రుగ్మతల నివారణగా ప్రతీక చెందింది. అదనంగా రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ చంద్లాపూర్‌కు గ్రామానికి మరో మనిహరంగా మారింది, రిజర్వాయర్‌ ఈ ప్రాంతానికి అరుదైన విశిష్టతను తీసుకువచ్చింది అనడం లో సందేహం లేదు. సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉన్న కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ యొక్క లింక్‌ రిజర్వాయర్లలో రంగనాయక సాగర్‌ ఒకటి. రంగనాయక సాగర్‌ను మెగా టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ భాగాన్ని రూ.10 కోట్లతో సమావేశాలు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు కు అనువుగా పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసింది. తరతరాలుగా ప్రసిద్ధి చెందిన గొల్లభామ చీరల ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న ఈ గ్రామం ఇక్కడి సంస్కృతిని ప్రోత్త్సహించడంతో పాటు సాంస్కృతిక, పర్యాటక రంగం పరిరక్షణకు ప్రసిద్ధి గాంచింది. చంద్లాపూర్‌ గ్రామం పర్యావరణ సుస్థిరత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందడంతో పాటు మైక్రో వాటర్‌ షెడ్‌ కార్యకలాపాలను ప్రోత్సహించడం, సహజ వనరుల సమాజ ఆధారిత నిర్వహణ కోసం గ్రామ వాసులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రసిద్ధి చెందింది. దీనిపై అవగాహన కలిపిస్తూ నివాసితులకు గుడ్డ సంచులు, జనపనార సంచులను అందించారు. పర్యావరణ రక్షణలో భాగంగా సోలార్‌ లైట్ల వినియోగిస్తున్నారు. తెలంగాణకు హరిత హారం (టిహెచ్‌హెచ్‌)ని పెద్దఎత్తున ప్రచారం చేస్తూ గ్రామంలో విరివిగా మొక్కలు నాటి పచ్చని గ్రామంగా తీర్చి దిద్దారు. టూరిజం విస్తరణతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తోంది. గ్రామంలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపర్చుకుంటూ ఆర్ధికంగా నిలదొక్కుకుంటూ, సాంస్కృతిక పర్యాటక రంగాలలో అబివృద్ది సాధిస్తూ ప్రణాళిక బద్ధంగా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామం సాధించిన ప్రగతీ నేడు గ్రామాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపింది. హరిత హోటల్‌ , శిల్పారామం పర్యాటకులను ఆకర్షిస్తోంది. టూరిజం డెవలప్‌మెంట్‌, వాల్యూ చైన్‌ ఇంటిగ్రేషన్‌ తో ఈ గ్రామీణ ప్రాంతంలో వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డ్రైవ్‌ కింద ఈ గ్రామంలో టూరిజం కార్యకలాపాలు పెద్ద విజయం. చంద్లాపూర్‌తో పాటు, జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామలుగా ఎంపికైంది. 795 గ్రామీణ ప్రాంతాలలో, పెంబర్తికి గ్రామీణ కళాకారుల కార్యకలాపాలను పరిరక్షించడం, ప్రోత్సహించడంతో ఈ గుర్తింపు లభించింది.