చట్టముండగా జీవో ఎందుకు?

3

– జీవో -78 రాజ్యాంగ విరుద్ధం

– ప్రొఫెసర్‌ కోదండరాం

హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి):ఉద్యాన వర్సిటీలో ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి జీవో నంబర్‌ 78 రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. శనివారం రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ వర్సిటీల రిసెర్చ్‌ స్కాలర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో ‘వర్సిటీలు-స్వయం ప్రతిపత్తి’ అంశంపై జేఏసీ కన్వీనర్‌ కాటం శ్రీధర్‌ అధ్యక్షతన వెటర్నరీవర్సిటీ జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ చేసిన చట్టం ద్వారా యూనివర్సిటీలు ఏర్పడ్డాయని తెలిపారు. వర్సిటీకి సంబంధించిన చట్టం ముందు ప్రభుత్వం ఇచ్చే జీవోలు చెల్లవని ఆయన తెలిపారు. యూనివర్సిటీ చట్టం ప్రకారమే అధ్యాపకుల నియామకాలు జరగాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం సర్వీస్‌ కమిషనర్‌ ద్వారా అధ్యాపక నియామకాలు చేపడితే వర్సిటీలు బాగుపడతాయా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ… విశ్వవిద్యాలయాల నియామకాల్లో గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే ఓ కమిటీ వేసి అవి మరోసారి జరగకుండా చూడాలన్నారు. అంతేకానీ, అధ్యాపకుల నియామక బాధ్యతలను టీఎస్‌పీఎస్సీకి ఇవ్వడం ద్వారా సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల కన్వీనర్‌ ప్రభాకర్‌రెడ్డి, ప్రొఫెసర్లు జానయ్య, లక్ష్మణ్‌, విద్యాసాగర్‌, గోవర్థన్‌, హనుమాన్‌నాయక్‌, జేఏసీ నాయకులు సాయికుమార్‌, సంపత్‌, కిరణ్‌, శ్రావణ్‌, విద్యాసాగర్‌, రాజశేఖర్‌ తదితరులున్నారు.