చట్టాల్లో మార్పు వచ్చే వరకూ ..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) :

చట్టాల్లో మార్పు వచ్చే వరకూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని విద్యార్థులు, యువత పునరుద్ఘాటించారు. ఢిల్లీలో కామాంధుల అరాచకానికి బలైపోయిన అమానత్‌కు సోమవారం జంతర్‌మంతర్‌ వద్ద నివాళులర్పించారు. భారతీయ చట్టాలు కఠినంగా లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కోసం ఎంతకాలమైన పోరాటం చేస్తూనే ఉంటామని మూడు రోజుల నుంచి నిరాహారదీక్ష చేస్తున్నామని, బాధితురాలికి న్యాయం జరిగేవరకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసేవరకు అన్నం తినకుండా ఈ ఆందోళనను కొనసాగిస్తామని బాబూసింగ్‌ అనే యువకుడు మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఏఐఎస్‌ఎ అనే విద్యార్థి సంఘం ఆదివారం మూడు గంటల

నుంచి సెంట్రల్‌ పార్క్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. ఈ ఆందోళనలో వేలాదిమంది విద్యార్థులు పాల్గొంటారని భావిస్తున్నామని, ఈ సందర్భంగా మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహిస్తామని ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ సుచిత తెలిపారు. ఇదిలా ఉండగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండటంతో ఎలాంటి అలవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించి కొనసాగించారు.  మింటోరోడ్‌, దీనదయాల్‌ ఉపాద్యాయ మార్గ్‌, బెంగాలీ మార్కెట్‌, క్లెమ్స్‌ ఫోర్డ్‌ రోడ్లో ఈ సాయంత్రం 7గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించబోమని ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 7:30గంటల  తర్వాత రాజీవ్‌చౌక్‌, పటేల్‌చౌక్‌, భరాక్మారోడ్‌, మెట్రో రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. సాయంత్రం 7 గంటలకు టికెట్ల జారీని నిలిపివేసి స్టేషన్లను మూసివేశారు.