చర్చలకు ఎప్పుడూ సిద్ధమే


– అమెరికాకు స్పష్టం చేసిన ఉత్తరకొరియా
సియోల్‌, మే25(జ‌నంసాక్షి) : తాము ఇప్పటికీ అమెరికాతో చర్చలకు సిద్ధమేనని ఉత్తరకొరియా ప్రకటించింది.  ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా-ఉత్తరకొరియా అధ్యక్షుల భేటీ రద్దయిన విషయం విధితమే. కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో తాను భేటీ కావడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అయితే ట్రంప్‌ నిర్ణయంపై ఉత్తరకొరియా విచారం వ్యక్తం చేసింది. ఇంత జరిగినప్పటికీ తాము అమెరికాతో
చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది.  ఈమేరకు ఆ దేశ అధికారిక విూడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశాన్ని రద్దు చేస్తారని మేం ఊహించలేదని, ఇది చాలా విచారకరమని ఉత్తరకొరియా మంత్రి కిమ్‌ కై గ్వాన్‌ చెప్పినట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. కాగా.. ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా దీనిపై స్పందించినట్లు తెలిపింది. ‘అమెరికాకు మేం మళ్లీ చెబుతున్నాం. సమస్య పరిష్కారం కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా సరే ముఖాముఖీగా భేటీ అయ్యేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని కిమ్‌ అన్నారు. ట్రంప్‌, కిమ్‌ మధ్య జూన్‌ 12న సింగపూర్‌లో భేటీ జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్‌ గురువారం ప్రకటించారు. ఈ మేరకు కిమ్‌కు లేఖ కూడా పంపించారు. విూతో భేటీ అవ్వడానికి నేను ఆస్తక్తిగా ఎదురు చూశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఇటీవల విూరు చేసిన ప్రకటనల్లో అమెరికాపై ఎంతో ద్వేషం, శత్రుత్వ వైఖరిని ప్రదర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ భేటీ అనవసరం అనిపించింది అని ట్రంప్‌ ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. ఉత్తరకొరియాలో అణుపరీక్షా కేంద్రాన్ని పేల్చేసిన కొద్ది గంటలకే ట్రంప్‌ సమావేశాన్ని రద్దు చేయడం గమనార్హం.