చలసానికి కన్నీటి వీడ్కోలు

2

విశాఖపట్నం, 16 జులై  (జనంసాక్షి):

విరసం వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్‌కు సాహితీలోకం కన్నీటివీడ్కోలు పలికింది. చలసాని కడసారి చూపుకోసం భారీగా తరలివచ్చిన సాహితీవేత్తలు, సాహిత్య లోకం పెద్దదిక్కు కోల్పోయిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం చలసాని ఇంటి నుంచి కేజీహెచ్‌ వరకు కొనసాగిన అంతిమ యాత్రలో చలసాని అమర్‌ రహే, లాల్‌ సలామ్‌ చలసాని అన్న నినాదాలు దారిపొడవునా మారుమ్రోగాయి. అంతిమ యాత్రలో సాహితీవేత్తలు, రాజకీయ నేతలతో పాటుగా భారీ సంఖ్యలో పాల్గొన్న చలసాని అభిమానులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం చలసాని పార్థీవ దేహాన్ని ఏయూ మెడికల్‌ కాలశాల అనాటవిూ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు.

అంతకు ముందు చలసాని పార్థీవ దేహాన్ని సందర్శించిన పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు. మనసు, శరీరం ఒక్కటై బతికామని, ఇప్పుడు చలసాని తనను ఒంటరి చేసి వెళ్లిపోయాడని విరసం నేత వరవరరావు కన్నీరుమున్నీరయ్యారు. తనకంటూ ఏవిూ లేకుండా, సమాజమే తనదని, ప్రపంచమే తనదనుకుంటూ ప్రేమపంచి, సేవలు చేసి ఏ ఒక్కరితో సేవ చేయించుకోకుండా వెళ్లిపోయాడని వరవరరావు కన్నీరు కార్చారు. విశాఖ ఎంపీ హరిబాబు, పౌరహక్కుల నేత హరగోపాల్‌, ప్రజాగాయకుడు వంగపండు ప్రసాద్‌, కె. శ్రీనివాస్‌, జీఎస్‌ రామ్మోహన్‌ చలసానికి నివాళులర్పించారు. చలసానితో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. చలసాని ఇంటిదగ్గర విరసం ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. చలసాని ఆశయ సాధనకు పునరంకితం కావాలని వక్తలు పిలుపునిచ్చారు.