చాకలి గుడిసెలు గ్రామంలో పర్యటించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని చాకలి గుడిసెలు గ్రామంలో కుల వివక్షకు గురి అయిన వింజమూరి బాలామణి కుటుంబాన్ని సీనియర్ న్యాయవాది మల్లెపల్లి జగన్, వంగూరు మండల ఎం ఆర్ పిస్ అధ్యక్షులు చింతకుంట్ల నిరంజన్  పరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో కూడా ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడటం దారుణమైన చర్య అని, ఈ 75 సంవత్సరల స్వతంత్ర భారతంలో ఇంకను దళితుల పట్ల ఆటవికంగా ప్రవర్తించటం చాలా దారుణం అని వారు ఆవేదన వ్యక్తంచేశారు. చాకలి గుడిసెలు గ్రామంలో దళితుల పట్ల ఆ గ్రామంలోని కొంతమంది కావాలని కుల వివక్షతకు గురి చేస్తున్నారని, కుల వివక్ష విధానాలు మానకపోతే “చలో చాకలి గుడిసెలు”అని పెద్ద ఎత్తున  ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ నెల 30 వ తేదీన పౌర హక్కుల దినం రోజున అధికారులు అఫీషియల్ గా ఆ గ్రామంలో జిల్లా కలెక్టర్  నేతృత్వంలో జిల్లా ఎస్పీ ,ఆర్డీఓ , తహసిల్దార్ , మండల ఎస్ఐ  ఆధ్వర్యంలో దళితులతో సామూహిక ఆలయ ప్రవేశం జరగాలని, సహాపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఫీల్డ్  దళితులను కూలికి పిలవకపోవడం, దసరా నాడు గుడిలోకి వారు వెళ్లిన తర్వాత మళ్ళీ శుభ్రపరచడం ఒంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లక్ పతి నాయక్, మంజుల తదితరులు పాల్గొన్నారు.