చాకో మాటల వెనుక ఆంధ్రా పార్టీలు

కోదండరామ్‌
హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) :
తెలంగాణ అంశాన్ని యూపీఏ కామన్‌ మినిమం ప్రోగ్రాంలో చేర్చలేదని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో చేసిన వ్యాఖ్యలపై టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. ఆయన మాటల వెనుక సీమాంధ్ర పార్టీల హస్తముందని పేర్కొన్నారు. సీమాంధ్ర నేతల చేతిల్లో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు బందీలు కావడం మామూలేనని తెలిపారు. తెలంగాణ అంశాన్ని యూపీఏ ఉమ్మడి కార్యాచరణలో పెట్టినట్లు అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం డిసెంబర్‌9, 2009న ప్రకటించారని గుర్తు చేశారు. అదే విషయాన్ని మరుసటి రోజు లోక్‌సభలో ప్రస్తావించారని తెలిపారు. ఇవన్నీ మరిచి ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇప్పటికైనా తెలంగాణ ఇవ్వకుంటే జేఏసీ ఆధ్వర్యంలో గతంలో కనీవినీ ఎరుగని ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ నీతికి, నీతిబాహ్య విధానాలకు చాకో ప్రకటన అద్దం పడుతోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గతంలో ఇచ్చిన హామీని విస్మరించి ఆ పార్టీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. ఇంకా జాప్యం చేస్తే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.