చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

– వేక కంపెనీ ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన
పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యలేమిపై యాజమాన్యంతో వాగ్వాదం
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముచ్చర్ల గ్రామానికి చెందిన మీనంపల్లి మొగులయ్య (48) గత మూడేళ్లుగా ఆ గ్రామ సమీపంలో గల వేక పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు.నాలుగు రోజుల క్రితం విధినిర్వహణలో భాగంగా పరిశ్రమలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడికక్కడే కుప్పకూలి‌ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.జరిగిన ఘటనపై పరిశ్రమ యాజమాన్యం వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మొగులయ్య తుది శ్వాస విడిచారు.అయితే మృతి చెందిన కార్మికుడు మొగులయ్యకు పీఎఫ్, ఈఎస్ఐ,భీమా లాంటి సౌకర్యాలు కల్పించక పోవడంపై వేక కంపెనీ యాజమాన్యంతో స్థానిక ప్రజలు, ఎమ్మార్పీఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. పరిశ్రమ ముందు మృత దేహాన్ని ఉంచి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు.పరిశ్రమ యాజమాన్యం కార్మికుల రక్షణ కోసం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే మొగులయ్య మృత్యువాత పడ్డారని వారు ఆరోపించారు.సమాచారం తెలుసుకున్న పటాన్ చెరు డీఎస్పీ భీంరెడ్డి,సీఐ లాలు నాయక్,వేణుకుమార్,స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి,సాయి కృష్ణలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు.బాధిత కుటుంబీకులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.