ఎస్‌బీఐ బ్యాంకుకు తాళం
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)కు కొందరు ఖాతాదారులు తాళం వేసి, బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంక్‌లో గత సంవత్సరం నవంబర్ 19న దుండగులు చోరీకి పాల్పడి 497 మందికి చెందిన సుమారు 16 కిలోలకు పైగా బంగారాన్ని చోరీ చేశారు. తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా.. బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు ఎదుట పలు మార్లు ఆందోళన చేయగా ఇటీవల ఏప్రిల్ 4న చెల్లింపులు చేపడతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఇవాళ బాధితులు బ్యాంక్ వద్దకు వెళ్లగా.. సోమవారం రావాలని అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. బ్యాంకు అధికారులు, పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేసినా వినకుండా బ్యాంకు ఎదుటే కూర్చున్నారు. బంగారం తిరిగి ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు.