మస్క్ విషయమై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ఆయనకు అలాంటి పవర్స్ లేవన్న అధ్యక్షుడు!
టెస్లా బాస్, డోజ్ సారథి ఎలాన్ మస్క్ (Elon Musk) అంటే తనకు అభిమానమని.. అతడు వీలైనన్నాళ్లు తన కార్యవర్గంలో కొనసాగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆకాంక్షించారు. ఆయన గురువారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మస్క్ నా కార్యవర్గంలో కొనసాగాలి. అతడిని ఇష్టపడటానికి చాలా కారణాలున్నాయి. ఒకటి: నేను అతడిని ఇష్టపడతాను, రెండు: అతడు అద్భుతంగా పనిచేశాడు, మూడు: అతడు ఓ దేశభక్తుడు’’ అని ట్రంప్ వివరించారు.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పాలనలో వ్యయ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ’ (డోజ్) విభాగానికి మస్క్ సారథ్యం వహిస్తున్నాడు. అతడికి స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయి (ఎస్‌ఈజీ) హోదా ఉంది. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కన అతడి 130 రోజుల గడువు మే 30తో పూర్తికానుంది. దీనిని ఉద్దేశించే ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం తొందరపడటంలేదు.. కానీ, మస్క్ వెళ్లిపోవాల్సిన సమయం వస్తుంది. ఆయన నిర్వహించటానికి చాలా కంపెనీలున్నాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఎలాన్ ఎప్పుడు డోజ్ వీడతారనే కచ్చితమైన తేదీని మాత్రం ట్రంప్ చెప్పకపోవడం గమనార్హం. ‘‘కొన్ని నెలల్లోనే ఇది జరగొచ్చు’’ అని ముక్తసరిగా చెప్పారు. అతడు తనకు ఇష్టం వచ్చినన్నాళ్లు కార్యవర్గంలో కొనసాగొచ్చని ట్రంప్ ప్రకటించారు.
మస్క్‌ను తన కార్యవర్గంలో కొనసాగించేందుకు వీలుగా ఏమైనా ఇతర బాధ్యతలు అప్పగిస్తారా..? అని విలేకర్లు ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ ‘‘ నేను చేస్తాను. మస్క్ గొప్ప వ్యక్తి’’ అని అన్నారు.
మస్క్ తర్వాత కూడా డోజ్ పని కొనసాగుతుంది..!
మస్క్ వైదొలగిన తర్వాత కూడా డోజ్ తన పనిని కొనసాగిస్తుందని ట్రంప్ చెప్పారు. క్యాబినెట్ సెక్రటరీలు దీని బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక డోజ్‌లోని ఉద్యోగులు ఫెడరల్ ఏజెన్సీల్లో కీలక స్థానాల్లో నియమిస్తామన్నారు. ఇటీవల డోజ్ గుర్తించిన లోపాలు చాలా భయంకరంగా ఉన్నాయన్న ట్రంప్.. మిగిలిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. డోజ్ విషయంలో గొప్పతనం మస్క్‌కు చెందుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.