చిచ్చు రేపుతున్న ఉపరితగనుల వ్యవహారం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఉపరిత గనలు వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధించామని చెప్పుకుంటున్న దశలో ఓసిపిల వ్యవహారం సింగరేణిలో చిచ్చు రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకులు సైతం ఇందుకు ప్రజలకు మద్దతుగా ప్రకటనుల చేయాల్సి వస్తోంది. బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి బీపీ ఓసీపీ-2(అబ్బాపూర్‌) కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వమని, పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చూస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.ఓసీపీల ఏర్పాటుతో గిరిజనులకు అన్యాయం చేస్తే సహించబోమన్నారు. భూనిర్వాసితులందరికీ పూర్తి స్థాయిలో సింగరేణి యాజమాన్యం పరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడతామన్నారు. బీపీ ఓసీపీ-2 ప్రాజెక్టు కింద అబ్బాపూర్‌ గ్రామంతో పాటు భూములు ముంపునకు గురికానుండటంతో గ్రామస్థులు తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అబ్బాపూర్‌ ప్రజలు కొన్నేళ్లుగా అటవీ భూములు సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించేలా చూడాలని జీఎంను కోరారు. అటవీ భూములు కాస్తు చేసుకున్న వారికి సైతం పరిహారం చెల్లించాలన్నారు. బెల్లంపల్లి పట్టణ సమస్యలను సైతం ఆయన జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లికి వచ్చిన కేసీఆర్‌ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపరితల గనులను కానివ్వకుండా కుర్చీ వేసుకొని కుర్చుంటానని ఇచ్చిన హావిూ నిలబెట్టుకోవాలని  కల్యాణిఖని ఉపరితలగని బాధిత గ్రామం దుబ్బగూడెంవాసులు ఇటీవల వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కుర్చీ వేసి ఆహ్వానించినట్లు నిరసన తెలిపారు. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన  కెసిఆర్‌  ప్రభుత్వం ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కల్యాణి ఉపరితల గనితో ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు శాశ్వతంగా కోల్పోయి ఉపాధి లేక కూలీలు, రైతులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. మానవ మనుగడకు, పర్యావరణాన్ని నాశనం చేసే ఉపరితలగనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడ్డుకొని ప్రజలకు ఇచ్చిన హావిూని నెరవేర్చాలని దుబ్బగూడెం గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఓ వైపు లక్ష్యాన్ని సాధించామని సింగరేణి ప్రకటించుకుంటున్న తరుణంలో ఓపిసిలు చిచ్చు పెడుతున్నాయి.