చిదంబరం భార్యకు సమన్లు

న్యూఢిల్లీ, మే1(జ‌నం సాక్షి) : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుటుంబం మళ్లీ కష్టాల్లో పడింది. ఇప్పటికే ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోగా.. తాజాగా శారదా కుంభకోణం కేసులో చిదంబరం భార్య నళినికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈనెల 7న కోల్‌కతాలోని కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయానికి రావాలని సమన్లు పంపింది. మనీల్యాండరింగ్‌ వ్యవహారంలో నళిని చిదంబరం వాంగ్మూలం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. శారదా కుంభకోణం కేసుతో ఆమెకు సంబంధం ఉన్నట్లు చెబుతున్నారు. ఈడీ సమన్లను సవాలు చేస్తూ నళిని దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు గతవారం తిరస్కరించింది. న్యాయ సహాయానికి సంబంధించి శారదా గ్రూపు నుంచి రూ.1.26 కోట్లను నళిని చిదంబరం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకు ఒకసారి ఈడీ, సీబీఐ ఆమెను ప్రశ్నించాయి. తాజాగా మరికొన్ని ఆధారాలు లభించడంతో మళ్లీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.