చినిగిన గొడుగు

వర్షంలో చినిగిన గొడుగు తోలు చెప్పులు
చేతబట్టి మోకాలు లోతు వరదలో
ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని
అతి కష్టంపై ఎదురీదుతూ అవ్వ తాత

గాలి వానకు గూడు చెదిరి రోడ్డుపై
జీవితం ఏ దిక్కు లేక బతుకుదెరువుకు
ప్రయాణం ఎందాకో, ఎక్కడికో తెలియదు
కాలంతో పోరాటం మనుగడకై ఆరాటం

అటూ ఇటూ చూస్తూ తలదాపుకై
వెతుకులాట ముఖంలో ఆందోళన
నీరసంగా అడుగులు ముందుకు వేస్తూ
భవిష్యత్తుకై ఆలోచిస్తూ కొత్త ఆశలతో

కదులుతూ నాకు నువ్వు – నీకు నేను
కడదాక కష్టమైనా నష్టమైనా కాపాడుకుంటా
ఆనాటి పెళ్లి ప్రమాణాలు యాదికొచ్చినాయి
వృద్ధాప్యంలోను వారి బంధం ఆదర్శం

నేటి మానవ సమాజంలో బంధాలు కరువై
నాది నీదని వేరు చేస్తూ వీడిన బంధాలు ఎన్నో….

మిద్దె సురేష్
కవి, వ్యాస కర్త
9701209355