చిన్నారులకు పోలియో చుక్కలు తప్పని సరి : కలెక్టర్
నిజామాబాద్, జనవరి 20 (): ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా 0-5 సంవత్సరాల లోపు పిల్లందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఇందుకు గాను తల్లిదండ్రలు, అధికారులు అందరు తమ వంతు సహకారం అందించి, పోలియో రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్థూ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా నగరంలోని ఖిల్లా బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. చిన్న పిల్లలకు చుక్కలు వేసి తల్లిదండ్రులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 3,27,675 మంది పిల్లలు ఉన్నారని, ఇందు కోసం 1710 పోలియో బూత్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 100 శాతం పిల్లందరికీ చుక్కలు వేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ప్రయాణికుల పిల్లలకు కూడా వైద్య సిబ్బంది చుక్కలు వేస్తున్నారని తెలిపారు. 21, 22 తేదీల్లో కూడా వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ చిన్న పిల్లలకు చుక్కలు వేస్తారని తెలిపారు. పిల్లలు పోలియో భారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు సంయుక్త కలెక్టర్ శ్రీరాంరెడ్డి, డిఎం అండ్ హెచ్‌వో హరినాథ్, నిజామాబాద్ ఇన్‌ఛార్జి ఆర్‌డివో, సివిల్ సప్లయి డిఎం సతీష్‌చంద్ర, ఆర్టీసీ ఆర్‌ఎం కృష్ణకాంత్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ ముంగతాయారు, ఎంహెచ్‌వో సిరాజోద్దిన్, వైద్య సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.