చిమ్మపుడి ప్రభుత్వ పాఠశాలకు ఇంగ్లీష్ టీచర్‌ను కేటాయించాలి

ఖమ్మం  అక్టోబర్ 16: రఘునాధపాలెం మండలం చిమ్మపుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 4 నెలలుగా ఖాశీగా ఉన్న ఇంగ్లీష్ టీచర్‌పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ, విద్యార్ధులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల రుమేష్, తాళ్ళ నాగరాజులు మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నప్పటికిని నేటికి ఆ పాఠశాలలో విద్యార్ధులకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పడానికి ఆ విభాగానికి చెందిన టీచర్‌ను నియమిండంలో ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు పూర్తిగా విఫలమైనారని ఆరోపించారు. గత రెండు నెలలుగా విద్యార్ధులు, గ్రామ పెద్దలు అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టినప్పటికిని డిఇఓగాని, ఎంఇఒగాని పట్టించుకున్న పాపానపోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ పాఠశాలకు ఇంగ్లీష్ టీచర్‌ను కేటాయించి విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని, లేని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలును ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారితో వాగ్వాద్దం చోటుచేసుకుంది. కచ్చితంగా రెండు రోజుల్లో టీచర్‌ను నియమిస్తామని డిఇఒ హామీనిచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు బి విద్యాసాగర్, గ్రామ పెద్దలు నాగిరెడ్డి, విద్యార్ధులు పాల్గొన్నారు.