చివరిదశకు హుజూరాబాద్ ప్రచారం
నేటితోముగియనున్న ప్రచారం
ఇంటింటి ప్రచారంలో నేతల బిజీ
కరీంనగర్,అక్టోబర్26 (జనం సాక్షి) హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి ప్రచారంలో బీజేపీతో పాటు కాంగ్రెస్, అధికార టిఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆఖరి క్షణం వరకు హుజురాబాద్‌లో ప్రచారం నిర్వహించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం 27తో హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ధర్మపురి అరవింద్, రఘనందనరావు, జితేందర్ రెడ్డి తదితరులు హుజురాబాద్‌లోనే మకాం వేశారు. ఇంఛార్జ్ తరుణ్ చుగ్ బీజేపీ నేతలను సమన్వయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తని కమలనాథులు అంటున్నారు. పోలింగ్ రోజు వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకత్వం సూచనలు చేసింది. ఇదిలావుంటే జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ విూద గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల ఫోటోలను ప్లెక్సీల రూపంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యేలు రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలతో పాటు ఆయా స్థానాల్లో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్‌ఎస్ నాయకులను
అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఇకపోతే తాను అసైన్డ్ భూమిని కొన్నానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ప్రచారంలో బాగా పాపులర్ చేశారు. లేకపోతే సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అహంకారానికి, దుర్మార్గానికి గోరీ కట్టడం దగ్గరలో ఉందని చెప్పారు. తాను రాజీనామా చెయ్యలేదని, తనను పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. మంత్రి పదవి పోతే పోయిందని ఎమ్మెల్యేకు మాత్రం రాజీనామా చెయ్యకు బిడ్డా అని అందరూ చెప్పారని తెలిపారు. ఇజ్జత్ ఉన్నొన్ని కాబట్టి ఎమ్మెల్యేకు రాజీనామా చేశానని ఈటల తెలిపారు. అందుకే తిరిగి ప్రజల తీర్పు కోరుతున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని బాగా ప్రచారం చేస్తున్నారు. బంగారు తెలంగాణ రాలేదు కాని కేసీఆర్ కుటుంబం బంగారమైందన్నారు. నిరంకుశ కుటుంబ పాలన అంతం కావాటంఊ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. అమరుల త్యాగాల విూద ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన కొనసాగుతుందన్నారు. శాసనసభ జరిగితే గొంతె త్తే నాయకుడు కావాలా, కేసీఆర్ కుటుంబానికి జైజైలు కొట్టే వాడు కావాలా, ప్రశ్నించే నాయకుడు కావాలా, పది మందిలో ఒకడు కావాలా ఆలోచించుకోవాలన్నారు. నీతి నిజాయితికి ప్రతిరూపం ఈటల రాజేందర్ అని అన్నారు.