చీఫ్‌ జస్టిస్‌ అభిశంసనపై పట్టువదలని కాంగ్రెస్‌

సుప్రీం కోర్టు గడపదొక్కిన నేతలు
విచారణ చేయాలని కపిల్‌ సిబల్‌ పిటిషన్‌
నేడు చూస్తామన్న జస్టిస్‌ చలమేశ్వర్‌
న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై పెట్టిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. సిజెఐపై అభిశంసన నోటీసును తిరస్కరించడం చట్టవ్యతిరేకమని, ఉపరాష్ట్రపతి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తన పిటిషన్‌లో కాంగ్రెస్‌ పేర్కొంది. జస్టిస్‌ మిశ్రాపై అభిశంసన పక్రియను తక్షణమే చేపట్టాలని తన పిటిషన్‌ కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును కోరింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను సిజెఐ పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు గత నెలలో అభిశంసన నోటీసును ఇచ్చాయి. ఏడు పార్టీలకు చెందిన 64 మంది రాజ్యసభ సభ్యులు ఈ నోటీసుపై సంతకాలు చేశారు. అనంతరం ఈ నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకు అందించడం, ఆయన దాన్ని పరిశీలించి తిరస్కరించడం తెలిసిందే. తాము వేసిన పిటిషన్‌ను తక్షణమే విచారించాలని కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. రోస్టర్‌ ప్రకారం ఈ పిటిషన్‌ను సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకే తీసుకెళ్లాలని చలమేశ్వర్‌  కపిల్‌ సిబాల్‌కు సూచించారు. ఈ పిటిషన్‌ సిజెఐ అభిశంసనకు సంబంధించిందని, దీన్ని ఆయన ధర్మాసనం ముందుకు తీసుకెళ్లలేమని కపిల్‌ సిబాల్‌ తెలిపారు. ఈ క్రమంలో ఈ అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని చలమేశ్వర్‌ వెల్లడించారు.  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై తీసుకొచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభిశంసన నోటీసును తిరస్కరించడం చట్టవ్యతిరేకమని, ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. జస్టిస్‌ మిశ్రాపై వెంటనే అభిశంసన పక్రియ చేపట్టాలని పిటిషన్‌లో కోరింది. అయితే వెంకయ్యనాయుడు నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎంపీలు ప్రతిపాదించిన తీర్మానాన్ని ప్రాథమిక దశలోనే కొట్టివేయడం ఎంతమాత్రం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. నోటీసుపై కనీస సభ్యులు సంతకాలు చేసినప్పుడు దాన్ని విచారణ కమిటీకి పంపాలని, అంతేగానీ ఇలా తిరస్కరించడం చట్టవ్యతిరేకం అని పేర్కొంది.