‘చీలిక’ చేటెవరికి?

టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్‌టిపి ఓట్లు చీల్చేది ఏ పార్టీవి?
కొన్నిచోట్ల 3`5వేల వరకు ఓట్లు సాధించనున్న ఆయా పార్టీలు
ఈ సమీకరణంతో అధికార బీఆర్‌ఎస్‌కు కలిసొస్తుందని అంచనా
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే నష్టపోతామంటున్న కాంగ్రెస్‌!
వామపక్షాలు బరిలో ఉన్న స్థానాలపై ‘గులాబీ’ గురి
అనేక నాటకీయ పరిణామాలు.. ఎవరికి వారే అంచనాలు.. బెడిసికొట్టిన పొత్తు వ్యూహాలు.. వెరసి ఎన్నికల బరిలో నిలిచే పార్టీలకు, తెలంగాణ రాజకీయాలకు తుదిరూపం వచ్చినట్టే కనబడుతోంది. నాలుగైదు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడతాయని తొలుత భావించినా.. చివరకు అవేవీ ఫలించకుండా ఒంటరిగానే బరిలో నిలిచేందుకు సిద్ధమైపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకంటే తమకే కలిసొస్తుందని పలు పార్టీలు గంభీర ప్రకటనలు చేస్తుండగా.. అంతిమంగా ఓట్లు చీలిపోయి బీఆర్‌ఎస్‌కే లాభిస్తుందని విశ్లేషకుల అంచనా. వివిధ పార్టీల ద్వారా సర్కారు ఓటు చీలితే తామే నష్టపోతామని కాంగ్రెస్‌ ఆందోళన చెందుతుండగా.. వామపక్షాలు బరిలో ఉన్న స్థానాలను ఎగరేసుకుపోవాలని ‘గులాబీ’ గురిపెట్టడం గమనార్హం.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) :
సీఎం కేసీఆర్‌ రంగప్రవేశంతో నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ దూకుడు పెరుగుతోంది. నెలన్నరకాలంగా స్తబ్దుగా ఉన్న అభ్యర్థులు ఒక్కసారిగా అధినేత రాకతో ఉత్తేజితులవు తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా కూడా వెలువడిరది. బీజేపీ కూడా నేడో రేపో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు టీడీపీ, వైఎస్సార్‌టీపీ, బీఎస్పీ కూడా ఎన్నికల్లో ఉధృతంగా ముందుకెళ్లేందుకు నిర్ణయించుకున్నా యి. ఇప్పటికే బీఎస్పీ 20మందితో జాబితాను వెల్లడిరచింది. తాజాగా టీడీపీ 87 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్‌లో విలీనం అవుతుందనుకున్న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. జనసేన కూడా 32 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని పవన్‌ కల్యాణ్‌ ఆ స్థానాలను వెల్లడిరచా రు. ఈ సమీకరణాలను నిశితంగా గమనిస్తే.. తెలంగాణ సర్కారుపై పెరిగిన వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ప్రధాన పార్టీలతో పొత్తుల వ్యవహారం కుదరకపోవడంతో చివరకు ఈ పార్టీలన్నీ ఒంటరిగానే బరిలో నిలవాలని నిశ్చయించుకున్నాయి.
కాంగ్రెస్‌కే అధిక నష్టం..!
దళితబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, బీసీబంధు వంటి పథకాలు పూర్తిస్థాయిలో లబ్దిదారులు చేరలేదని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లేందుకు యత్నించింది. స్వయంగా అగ్రనేతలు సోనియా, రాహుల్‌ వచ్చి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ శ్రేణులు సైతం క్షేత్రస్థాయిలోకి వెళ్లి గ్యారంటీలను ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. అయితే చిన్న పార్టీలు ఒంటరిగా బరిలో నిలవడం ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ, త్రిముఖ పోరు తలెత్తనుండగా.. చిన్నపార్టీలు చీల్చే ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయోననే టెన్షన్‌ ఏర్పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఈ పార్టీలు తరతమ స్థాయిలో ఆకర్షించగలిగితే అంతిమంగా కాంగ్రెస్‌కే అధిక నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు చాలాచోట్ల లాభించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సీపీఎం, సీపీఐ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఇబ్బందు లేదుగానీ.. వాటి ప్రభావం లేనిప్రాంతాల్లోనే ‘హస్తం’ పార్టీకి ప్రతికూలంగా మారనున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కర్నాటకలో కాంగ్రెస్‌కు పూర్తిమెజార్టీ కట్టబెట్టిన ఓటరు.. తెలంగాణలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి.

సెటిలర్ల ప్రాంతాలపై ఆశలు..
ఆంధ్రా వ్యక్తుల పార్టీగా ముద్రవేసుకున్న వైఎస్సార్‌టిపి, టీడీపీలు తెలంగాణ ఎన్నికల్లో పలు స్థానాలపై ఆశలు పెట్టుకున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అంత తేలిగ్గా లేవు. బీజేపీ పుంజుకుని ఒక్కసారిగా డీలాపడిపోగా.. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ప్రస్తుతం ఆరుగ్యారంటీలు ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌లో అధికారంపై ఆశావహ దృక్పథం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల తర్వాత ఉన్న చిన్న పార్టీలు చీల్చే ఓట్లు నిర్ణయాత్మకం కానున్నట్టు పరిశీలకులు భావిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైఎస్సార్‌టీపీ పార్టీలు సెటిలర్ల ప్రాంతాలు, ఖమ్మం జిల్లాపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు గతంలో గెలుపొందిన స్థానాల్లో టీడీపీ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని ఆ పార్టీ నేతలు ఆశిస్తుండగా.. వైఎస్సార్‌ అభిమానులున్న ప్రాంతాలపైనా షర్మిల పార్టీ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. బీఎస్పీ కూడా బడుగు బలహీన వర్గాల ఓట్లతో పాటు స్వేరోలు, యువతను ఆకర్షించేందుకు ముమ్మరంగా కసరత్తు చేసింది. గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పర్యటించడం, ఆయనవైపు యువత మోటివేట్‌ కావడం గమనార్హం. ఇదెంత వరకు ఫలితాన్నిస్తుందో తెలియదుగానీ.. కొన్ని నియోజకవర్గాల్లో 2 నుంచి 3వేల వరకు ఓట్లు కూడ గట్టే పరిస్థితులున్నాయి. ఈ మూడు పార్టీల అభ్యర్థులు స్వయంగా గెలవకపోయినా ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.