చురుకుగా కంటి వెలుగు కార్యక్రమం
ప్రత్యేక శిబిరాలకు తరలివస్తున్న ప్రజలు
కామారెడ్డి,ఆగస్ట్29(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పేరుతో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి చేస్తోన్న ఈ ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షల ఆధారంగా కళ్లద్దాలు, మందులు, శస్త్ర చికిత్సలు చేసేందుకు సిద్ధంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్ ఉన్నామని అన్నారు.ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.ఆగస్టు 15వ తేదీ నాడు ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ఊరూరా ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్యక్రమానికి ప్రతి పల్లెలో విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 22 బృందాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కో బృందం కనీసం 200 నుంచి 250 మందిని పరీక్షిస్తుండగా ఇప్పటి వరకు దాదాపుగా 30వేల మందిని గడిచిన కొద్ది రోజుల్లో నేత్ర పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో దాదాపుగా 4వేల మందికి శిబిరాల్లో తేలిన పరీక్షల ఫలితాల ఆధారంగా రీడింగ్ కళ్లద్దాలను పంపిణీ చేశారు. సుమారుగా 5వేల మందికి దృష్టి లోపం ఎక్కువ ఉండగా వారికి మెరుగైన కళ్లద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కంటి సమస్యలతో తీవ్రంగా బాధ పడుతున్న వారిని జిల్లాలో దాదాపుగా 3,500 మందిని వైద్య సిబ్బంది గుర్తించారు. వీరి వివరాలను నమోదు చేసుకున్న అధికారులు వారికి వీలైనంత త్వరలోనే శస్త్ర చికిత్సలు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. అవసరాన్ని బట్టి హైదరాబాద్లోని పెద్దాసుపత్రికి పంపించనున్నారు.