చెట్లపొదల్లో మరో మహిళతో ఏకాంతంగా ఉన్న ఇన్‌స్పెక్టర్..
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
మారేడుపల్లి మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు నిర్వాకం మరువకముందే మరో ఇన్‌స్పెక్టర్ ఉదంతం బయటకు వచ్చింది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సౌత్‌జోన్ పోలీసు కంట్రోల్ రూంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ డ్యూటీకి వెళ్లిన రాజు విధులు ముగించుకొని తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ వద్ద గురువారం అర్థరాత్రి చెట్లపొదల్లో ఓ మహిళతో కారులో ఏకాంతంగా ఉండగా, అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. రాజుకు ఎప్పటి నుంచో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన అతని భార్య తన ఇద్దరు పిల్లల్ని వెంట తీసుకొని సీఐ రాజును ఫాలో అయింది.
తాను సీఐ నంటూ కానిస్టేబుల్స్‌పై దాడి..
ఈ క్రమంలో గురువారం రాత్రి ఇన్‌స్పెక్టర్ రాజు ఓ మహిళను కారులో ఎక్కించుకొని చెట్లపొదల్లోకి వెళ్లగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు పిల్లల అరుపులు విని అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న రాజు తాను సీఐ అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి పాల్పడ్డారు. అక్రమ సంబంధ పెట్టుకున్న మహిళతో పాటు ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడి చేసినందుకు కానిస్టేబుల్స్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తనకు, తన పిల్లలకు అన్యాయం చేసి తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇన్‌స్పెక్టర్ రాజు భార్య వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది.
ఇన్‌స్పెక్టర్ రాజును పట్టించిన ఫోన్..
సీఐ రాజు ఐ ఫోన్ వాడుతుంటారు. భర్త అక్రమ సంబంధాన్ని ఐఫోనే బట్టబయలు చేసింది. ఫైండ్ మై లోకేషన్ ద్వారా భర్తను ట్రేస్ చేసింది. లోకేషన్ ద్వారా నేరుగా భర్త ఉన్న ప్రదేశానికి పిల్లలతో కలిసి వెళ్ళింది. అక్కడ తన భర్త వేరే మహిళతో ఒంటరిగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఇదేంటని భర్తను నిలదీసింది. తర్వాత పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇన్‌స్పెక్టర్ రాజు పోలీసులను దుర్భాషలాడుతూ వాళ్లపై దాడికి తెగబడ్డాడు.
ఇటీవల మారేడ్‌పల్లి సీఐగా పని చేసిన నాగేశ్వరరావు తుపాకీతో ఓ మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటుండగా అతనిని సర్వీసు నుంచి ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఆ ఘటన మరువకముందే ఇన్‌స్పెక్టర్ రాజు ఉదంతం వెలుగులోకి రావటంతో బాధ్యాతయుతంగా మెలగాల్సిన పోలీసులపై ప్రజలు ఫైర్ అవుతున్నారు.