చెన్నమనేని రాజేశ్వర్‌రావుకు అపూర్వ గౌరవం
` వేములవాడ, సిరిసిల్ల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు చెన్నమనేని నామకరణం
` శతజయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్(జనంసాక్షి): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ.. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పరిధిలో సాగు, తాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 (మల్కపేట రిజర్వాయర్‌తో పాటు దాని పరిధిలోని కాల్వలకు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా)కు చెన్నమనేని రాజేశ్వర్ రావు పేరు పెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు సామాజిక సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ మొదటి తరం రాజకీయవేత్తగా, నిరంతరం ప్రజల కోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర్ రావు అని కొనియాడారు. తెలంగాణ రైతాంగం కోసం ఆనాటి కాలంలోనే వరద కాల్వ కోసం, ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర ఆయనది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల నుంచి అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంత ప్రజల సాగు, తాగునీరు కష్టాలను తీర్చడానికి ఎత్తి పోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వర్ రావు ఎన్నో పోరాటాలు చేశారు. నాటి వారి ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా స్వరాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నాం. తెలంగాణ రైతాంగం నేడు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నారు. వారు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఆ ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 9 ద్వారా సాగునీరు అందుతున్నది. మిడ్ మానేర్ (ఎస్‌ఆర్‌ఆర్) నుంచి ఎత్తిపోతల ద్వారా అప్పర్ మానేర్ దాకా నీటి సరఫరా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నాటి వారి కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ, మల్కపేట రిజర్వాయర్‌కు దాని పరథిలోని ఎత్తిపోతల పథకానికి మొత్తంగా ప్యాకేజీ 9కు చెన్నమనేని రాజేశ్వర్ రావు పెట్టడం జరిగింది అని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది.