చెరువు

నది పొంటి మనిషి ఉండే వాడు

వాగు వెంట అతని మనసు ఉండేది

నీటిధార వెనుక ఆ మనిషి రాజేసుకునే నిప్పుండేది

కానీ

ఇప్పుడు ఆ మనిషి నీటి వెనుక లేడు

కన్నీటి వెనుకా లేడు

మనిషి రోడ్డు వెనుక ఉన్నాడు

రోడ్డు పొంటి ఉన్నాడు

దేవాలయాలు కూడా నదుల పక్కన ఉండేవి. కానీ ఇప్పుడు మనిషి తనలాగే రోడ్డు పక్కన గుళ్లని నిర్మిస్తున్నాడు. చాలా దేవాలయాలు నదుల పక్కనే ఉన్నాయి. కానీ మా రాజేశ్వరుడు తన ఆవాసాన్ని చెరువు పక్కన ఏర్పరుచుకున్నాడు. ధర్మగుండం, గుడి రెండు మాత్రమే ఉండేవని ఆ తరువాత చెరువును నిర్మించారని చెబుతారు. కాదు చెరువు మొదటి నుంచి ఉండేదని మరికొందరు చెబుతారు. రెండు కథనాలు వాడుకలో ఉన్నాయి. చెరువూ గుండం రెండూ కలిసే ఉంటాయి. దాని పక్కనే  ఎత్తైన స్థలంలో మా రాజేశ్వరుని గుడి.

చెరువూ ధర్మగుండం  రెండూ  కలిసి పోయినట్టుగా అనిపించినా రెండింటి మధ్య తెలియనట్టుగా ఓ విభజన రేఖ ఉండేది. భక్తులు ధర్మ గుండంలో స్నానం చేసే వారు. ఊరి వాళ్లు చెరువులో ఎక్కువగా స్నానం చేసే వాళ్లు. ధర్మ గుండంలో స్నానం చేసి రాజేశ్వరున్ని దర్శించుకుంటే సకల రోగాలు సమసిపోతాయని భక్తుల విశ్వాసం. వెనుకటికి ఓ రాజు వేట కోసం వచ్చి , ఆ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుని, గుడిని ధర్మగుండాన్ని చేశాడని, ఆ తరువాత గుండంలో స్నానం చేసి రాజేశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాత ఆయనకున్న రోగం పోయిందని పెద్దలు చెబుతారు. ఆ రాజే దేవాలయం నిర్మించా+డని కూడ అంటారు.మా ఊరి ప్రజలకు మా చెరువుకి అవినాభావ సంబంధం. అంతకు మించిన అనుబంధం. సెలవు రోజుల్లో మా చెరువు నిండా జనమే. కొంత మంది మామూలు రోజుల్లో కూడ రోజూ చెరువు దగ్గరకు వచ్చే వాళ్లు. ఇక్కడికి వస్తే వాళ్లకి రెండు పనులు అయిపోయ్యేవి. స్నానం అయ్యేది. ఆ తరువాత రాజేశ్వరుని దర్శనం అయ్యేది. మూల వాగునుంచి చుట్టు పక్కన ఉన్న వొర్రెల నుంచి వచ్చిన నీళ్లతో, వర్షం నీళ్లతో మా చెరువు నిండి పోయేది. నిండిన చెరువులో పిల్లలు, పెద్దలూ అంతా ఓ సంత లా ఉండేది. నిండిన చెరువులో అన పకాయలను పిల్లల నడుముకు కట్టి తండ్రులు తమ పిల్లలకి ఈతలు నేర్పే వాళ్లు. ఈత కొట్టే ప్రదేశానికి దూరంగా కొంత మంది గాలాలకి ఎరను కట్టి చేపలు పట్టే వాళ్లు. చెరువు పూర్తిగా నిండిం దంటే ఆ సంవత్సరం మా ఊరి బావులకి నీటి కొదువ ఉండేది కాదు. రైతులకి ఆనందంగా ఉండేది. వాళ్ల పంటలకి నీటి బాధ ఉండేది కాదు.మా ఊరి చెరువు మధ్యన చిన్న  ద్వీపం ఉండేది. అందులో చిన్న గుడి ఉండేది. దాన్ని మాలగడ్డ అనే వాళ్లం. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కాని నిండిన చెరువులో తేలుతున్న బతుకమ్మలా అన్పించేది. ఈత బాగా వచ్చిన పెద్దలు, యువకులు మాల గడ్డ దాక ఈతకొట్టి తిరిగి వచ్చే వాళ్లు. ఒక్కోసారి పోటీలు పెట్టుకునే వాళ్లు. ఆ పోటీలను చూడడం గొప్ప సరదాగా ఉండేది. అప్పు డప్పుడే ఈత నేర్చుకుంటున్న పిల్లలు ఆ పోటీలని కళ్లార్పకుండా చూసేవాళ్లు . చెరువు నిండుగా నిండు గర్భిణీలా ఉన్నపుడు మా అమ్మ మమ్మల్ని చెరువు వైపు పోనిచ్చేది కాదు. నిండిన చెరువు ఎవరినన్నా బలి తీసుకుం టుందని మా అమ్మ భయం. ఈ భయం మా ఉళ్లో చాలా మందికి ఉండేది. కాని అలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు.

ఈత నేర్చుకోవడానికి జనాలు ఉదయాన్నే కాదు, సాయంత్రాలు కూడ వచ్చేవాళ్లు చెరువు గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి చాలా మంది యువకులు వచ్చేవాళ్లు. స్నేహితులని కలవడం, కబుర్లు చెప్పుకోవడం, గుడికి వచ్చే అమ్మాయిలను చూడడం వాళ్లు చేసే పని అక్కడ. కాల క్రమంలో మా ఊరిలో రెండు థియేటర్లు వచ్చాయి. రెండు మూడు ఉడిపి హోటళ్లు వెలిశాయి. ఆ తరువాత చెరువు గట్టు మీదనే కాదు, హోటళ్ల దగ్గర, సినిమా హాళ్ల దగ్గర యవకులు కన్పించడం మొదలై ంది.ఫిబ్రవరి నుంచి మే వరకు ఎక్కువ జనం మా రాజేశ్వరుని దర్శనానికి వచ్చే వాళ్లు. శివరాత్రి జాతర రోజుల్లో విపరీతమైన జనం వచ్చే వాళ్లు. ఊరి వాళ్లకే దర్శనం కష్టం అయ్యేది. రెండు మూడు జిల్లాలకే ఎక్కువ ప్రసిద్ధమైన మా ఊరు చాలా దూర ప్రాంతానికి తెలిసిపోయింది. దాని వల్ల భక్తుల సంఖ్య మరీ ఎక్కువగా పెరిగి పోయింది. గుడిని విశాలంగా చేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే చాలా మార్పులు చేశారు. దాని వల్ల గుడి అంత ర్భాగంలో కొంత స్థలం పెరిగింది.మా చెరువు నీళ్లు ధర్మ గుండంలో కలుస్తున్నాయని ధర్మగుండం గట్టు భక్తులకు సరిపోవడం లేదని ధర్మగుండం చుట్టూ నిర్మాణం చేశారు. ఇప్పుడు ధర్మగుండంలోకి దిగడానికి నాలుగు వైపులా మెట్లు ఉన్నాయి. ఇదివరలో ఒకే వైపు ఉండేవి. అందమైన నిర్మాణం, ధర్మగుండం పవిత్రత కాపాడు కోవడంకోసం నిర్మాణం చేశారు. ఎండాకాలం నీళ్లు ఎండి పోయినపుడు చెరువుకి ధర్మగుండానికి గల భేదం స్పష్టంగా ఇంతక ముందు తెలిసేది. ఇప్పుడు రెండు వేరుగా మారిపోయినాయి. ఈ నిర్మాణం తరువాత ధర్మగుండంలోని నీళ్లు నిలువ నీరులా అయిపో యినాయి. చెరువులో కలిసి ఉన్నపుడు ధర్మ గుండంలో నీళ్లు పరిశుభ్రంగా ఉండేవి. కాని ధర్మ గుండం చుట్టూ కట్టిన నిర్మాణం వల్ల పరిశుభ్రత తగ్గి పోయింది. అయినా ధర్మ గుండంలో స్నానం చేసే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతూనే ఉంది. అందుకని ధర్మ గుండం నీళ్లు తోడి చెరువులో పోయడానికి ఓ రెండు మోటారు పంపులను ఏర్పాటు చేశారు. మా మూల వాగులో రెండు బావులని నిర్మించారు. అక్కడి నుంచి పైపుల ద్వారా ధర్మగుండంలోకి నీళ్లు వచ్చే ఏర్పాటు చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి చెరువుతో ధర్మగుండం కలిసివున్నప్పుడు  వున్న స్వచ్ఛత ఇప్పుడు ధర్మ గుండం నీటిలో లేదు. మా ఊరి ప్రజలు ధర్మగుండంలో మునగడం తగ్గించా రు. కాని బయటి నుంచి వచ్చిన భక్తులు మునగడం రోజురోజుకి పెరుగుతూనే ఉంది.

ప్రచార సాధనాలు పెరిగిన తరువాత, ప్రసార సాధనాలు పెరిగిన తరువాత మా రాజేశ్వరుని పేరు దేశ మంతటా పరివ్యాపితమైనది. దూర ప్రాంతాలనుంచి కూడ ప్రజలు రాజేశ్వ రుణ్ణి దర్శించు కోవడానికి వస్తూనే ఉంటారు. పూర్వం శివరాత్రి ముందు ఆ తరువాతే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఇప్పుడు ప్రతీ సోమవారం , శుక్రవారం జాతరలాగా అయిపోయింది. రోడ్డు మీద లెక్క లేనన్ని వాహనాలు నడపడం కష్టమైపోయింది. రాజేశ్వరుని దర్శనానికి మామూలుగా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పెద్ద క్యూ, దర్శనానికి క్యూ, దేవుడుకి కోడెలు కట్టేయడానికి అంతకంటే పెద్ద క్యూ, ఈ క్యూల కోసం దేవస్థానం లోపల ఇనుప రాడ్లతో ఓ క్రమాన్ని ఏర్పాటు చేశారు. అది సరిపోక క్యూ మా చెరువు గట్టుని ఆనుకుని మాలగడ్డ వైపు గట్టు వరకు వెళ్లేది. అదీ సరిపోవడం లేదని చెరువుని ఆక్రమించి క్యూ కాంప్లెక్స్‌ కట్టాలని ధర్మకర్తల మండలికి ఎవరో సూచించారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చెరువు గట్టున ఉన్న దేవాలయం ఆఫీసులని అక్కడి నుంచి వేరే దగ్గర  కట్టి క్యూ కాంప్లెక్స్‌ కట్టవచ్చు. కానీ చెరువుని ఆక్రమించడమే సుళువని ధర్మకర్తల మండలికి అన్పించింది. చెరువు మీద దేవస్థానం వారికి అధికారం లేదని, చెరువుమీద క్యూ కాంప్లెక్స్‌ కడితే చెరువులో నీటి నిలువ తగ్గిపో తుందని కొంతమంది అభ్యంతరాలు లేవనెత్తారు.అందరి అభ్యతరాలు బుట్టదాకలయ్యాయి. చెరువులో పిల్లర్లు వేసి క్యూ కాంప్లెక్స్‌ కడతారు కాబట్టి నీటి నిలువకి ఎలాంటి ఆటంకం వుండ దని కొంతమంది సూచనలు చేశారు. చివరికి చెరువు మీద క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌ అనుమతిని ఇచ్చారు. గట్టునుంచి పిల్లర్లు వేశారు. దానిమీద శ్లాబ్‌ వేసి ఇంకా పైదాకా పిల్లర్లు వేసి దానిపైనా శ్లాబు వేసి క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం చేశారు.

నీటి నిలువకి ఆటంకం వుండదని అన్నారు గానీ ఆ తరువాత నుంచి మా చెరువులో నీటి నిలువ తగ్గిపోయింది. నీళ్లడుగంటినాయి. చెరువులో పూడిక తీయడం తగ్గిపోయింది. మాగడ్డలో వున్న ద్వీపంలో తోట పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మెల్లిగా దాన్ని ద్వీపకల్పం చేశారు. క్రమంగా చెరువు గ్రామస్తుల అధీనం నుంచి వెళ్లిపోయింది. చెరువు లోతు తగ్గిపోయింది. దాని పరిధి కూడా తగ్గిపోవడం మొదలైంది. ఈ కారణాల వల్ల మా వూరి గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ పడిపోయింది. బావులన్నీ బోర్లాపడ్డాయి. బోరింగులు వేసుకున్నారు. అయినా అనుకున్న నీటిధార లేదు. చివరికి నీళ్లని పక్క గ్రామల్లోంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.గ్రామ పంచాయతీ నల్లాలు భూమి లోతుల్లోకి వెళ్లిపో యాయి. గెక్కెడు నీళ్లకోసం గొంతు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాక్లర్లు భూములని దున్నడం లేదు. అవి నీళ్లనీ ఇసుకనీ మోస్తున్నాయి. ట్రాక్లర్ల వెంట మోటారు పంపు కూడా వచ్చేసింది. మోటారు పంపుతో ఏకంగా ఇండ్లపైన ట్యాకుల్లోకి నీళ్లు ఎక్కించడం అలవాటుగా మారిపోయింది.ఇప్పుడు మా చిన్పప్పుడు కన్పించే చెరువులేదు. ఈతలు కొట్టే దృశ్యాలు లేవు. ఈతలు నేర్పే దృశ్యాలు అంతకంటే లేవు. వానాకాలం రోజుల్లో కూడా పిల్లలకి ఈతలు నేర్పే తండ్రులు అక్కడ కన్పించడం లేదు. ఇప్పుడు చెరువుని క్యూ కాంప్లెక్స్‌ ఆక్రమించింది. మాలగడ్డని పూలతోట ఆక్రమించింది. మిగతా ప్రదేశమంతా బురద. దానిపైన నీరు. సాయంత్రాలు గాలికోసం మా చెరువు గట్టుకి వచ్చే కుర్రవాళ్లు లేరు.ఇప్పుడు మా చెరువు నిండటం లేదు. అది ఒక బ్రహ్మయజ్ఞం. ఒకవేళ నిండినా అప్పటి లోతు లేదు. పరిధి అంత కంటే లేదు. ఇప్పుడక్కడ ఈతలు లేవు. ఈదురు గాలులు లేవు. అంతా కాంక్రీటుమయం.మా చిన్నప్పుడు ఈత నేర్చుకునే పిల్లలు నీళ్లు మ్రింగి తల్లడిల్లే వాళ్లు. ఇప్పుడు నీళ్లు లేక మా చెరువు తల్లడి ల్లుతుంది. మా చెరువు ఊపిరిని ఎవరో నొక్కేశారు. మా చెరువుని చూస్తే ఊపిరాడక తల్లడిల్లుతున్న దృశ్యమే నాకు కన్పిస్తుంది. నాకే కాదు ఎవరికైనా అట్లాగే కన్పిస్తుంది.ఇప్పుడు మా వూరి చెరువు ఊపిరి ఆడకుండా చేపపిల్లలా కొట్టు కుంటోంది. పంట పొలాలన్నీ ప్లాట్లుగా మారిపో యాయి. బావులు ఎండిపోయినవి. బోర్లు కూడా నీళ్లు లేక అల్లల్లా డుతున్నాయి. ఇదీ మారిన మా వూరు పరిస్థితి.మా వూరి చివర్లో ఓ స్మిమ్మింగ్‌పూల్‌ కట్టారు. అక్కడ డబ్బులు కట్టి ఈత నేర్చుకోవాలి. ఈత నేర్పడానికి తండ్రులు అవసరం లేదు. ఆనకా యల అవసరమూ లేదు. గాలితో నిండిన టైర్లు, ఈత నేర్పే మనుషులు.ఊటలాగా పైకి వచ్చే నీరు అదృశ్య మైంది. భూమి అట్టడుగు నుంచి పాతాళగంగను తెచ్చి స్మిమ్మింగ్‌ పూల్‌ని నీటితో నింపే పరిస్థితి.కాలక్రమంలో మార్పులు సహజమే. కానీ సహజ మైన వాటిని తొలగించి అసహజమైన వాటిని సృష్టించుకోవడం ఇప్పుడున్న పరిస్థితి. బహుశా ఇదే నేటి సృష్టిక్రమమేమో!