చెరువుల జలకళతో బతుకమ్మలకు సంబరం

వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల కురిసిన  వర్షాల నేపథ్యంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు అనువుగా చెరువులు కళకళలాడుతున్నాయి. చాలా చెరువుల్లో నీరు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మరో రెండురోజులు వర్షాలకు అవకాశం ఉందని చెప్పడంతో మరింతగా  నీరు వచ్చే అవకాశం ఉంది.  తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో వైభవంగా జరుగుతాయి. ఆడపడుచులంతా కలిసి ఆనందంగా జరుపుకునే పండగను రోజుకో విధంగా  ఘనంగా నిర్వహిస్తారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగినులు కూడా పాల్గొంటారు. గ్రామాల్లో  తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలంతా కోలాటాలు, సంప్రదాయ బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేస్తారు. దీనికి చెరువులకు జలకళ కూడా తోడయ్యింది. అక్టోబర్‌లో ఆరంభంకానున్న బతుకమ్మలకు చెరువుల్లో నీరు కూడా ముఖ్యం. ఈ యేడు పుష్కలంగా నీరు చేరడంతో బతుకమ్మలకు ఢోకా లేదని అంటున్నారు.