చేనేతకు చేదోడుగా ఉంటాంఇళ్లు లేని వారికి ఇస్తాం

కొరసవాడలో ముఖ్యమంత్రి కిరణ్‌ వెల్లడి
శ్రీకాకుళం, జూలై 28 : చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే వారి వ్యక్తిగత రుణాలను, సంఘాల రుణాలను మాఫీ చేశామన్నారు. శనివారంనాడు పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామంలో గల చేనేత కార్మికుల కాలనీలో వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల అభివృద్ధికిగాను ఈ ఏడాది బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. ఇదివరకు వాడిన 61 కోట్ల రూపాయల చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేశామన్నారు. జిల్లాలో 6580 చేనేత కార్మిక కుటుంబాలు ఉండగా వారిలో 4,370 మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వారందరికీ పెన్షన్లు అందజేయ నున్నట్టు హామీ ఇచ్చారు. కొరసవాడలోని చేనేత కార్మికులకు ఇళ్లు లేకుంటే ఇళ్లు ఇస్తామని, సిసి రోడ్లు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని సిఎం హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల అభివృద్ధికి ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందో ఆయా వృత్తిలో అనుభవం ఉన్న వారితో హైదరాబాద్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వచ్చిన సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు