చేనేత వస్త్రాలకు డిమండ్ వచ్చేలా చూస్తాం: జూపల్లి
హైదరాబాద్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ దక్కేలా చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో చేనేత ఉత్పత్తుల అమ్మకాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని భారీ పరిశ్రమవాఖ మంత్రి జూపల్లి తెలిపారు. రానున్న 2 ఏళ్లలో పరిశ్రమ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మెగాపవర్ లూమ్ క్లస్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హరిత ప్లాజాలో చేనేత కార్మిక సంఘాలతో మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. చేనేత కార్మికులు నైపుణ్యం పెంచుకునేలా శిక్షణా కార్యక్రమాలు ఇస్తామన్నారు. రానున్న బడ్జెట్‌లో ఇది మంజూరు అవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికుల ఆత్మహత్య నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్మికుల ఆత్మహత్యల నివారణకు రానున్న బడ్జెట్‌లో కొన్ని ప్రణాళికలు పెట్టాలని చూస్తున్నామని తెలిపారు. రానున్న బడ్జెట్ సెషన్‌లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరనున్నారని చెప్పారు. రాష్టాన్రికి సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని సీఎం కోరుతారని స్పష్టం చేశారు. దీంతో చేనేతకు పెద్ద పీట వేస్తామని కెటిఆర్ అన్నారు.