చేపప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

నేటి సాయంత్రం నుంచి ఆదివారం వరకు పంపిణీ
భారీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ప్రత్యక్షంగా పర్యవేక్షించిన మంత్రి తలసాని
మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ
హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): ఏటా మృగశిర కార్తె ప్రవేశంతో చేపట్టే చేపప్రసాదం పంపిణీకి సర్వం
సిద్ధమయింది. శనివారం దీనిని ప్రారంబించనున్నారు. దీనికి ప్రభుత్వం కూడా పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. ఇందుకోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లుచేసింది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు బత్తిని మృగశిర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ శనివారం  సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. మత్స్యశాఖ.. కొరవిూను చేపపిల్లలను అందుబాటులో ఉంచుతుండగా, బత్తిన సోదరులు చేప ప్రసాదాన్ని ఉచితంగా అందించనున్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.6 లక్షల కొర్రవిూన్లను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాద పంపిణీకి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 36 కౌంటర్లను ఏర్పాటుచేస్తున్నారు. చేప ప్రసాద పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్‌ గుగులోతు రవి చెప్పారు. బత్తిని మృగశిర ట్రస్ట్‌ ద్వారా అందరికీ ఉచితంగా ప్రసాదాన్ని అందించాలన్నదే తమ ఆకాంక్షని బత్తిని హరినాథ్‌గౌడ్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చొరువ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదాన్ని స్వీకరించలేనివారు ఆందోళనకు గురికావొద్దని, మరుసటిరోజు హైదరాబాద్‌లోని నాలుగుప్రాంతాల్లో ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి జనం చేప మందు తీసుకొనేందుకు ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చి ఎగ్జిబిషన్‌ మైదానం సహా పలు ప్రాంతాల్లో సేదతీరుతున్నారు. సదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికోసం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో సూచికబోర్డులను ఏర్పాటుచేశారు. శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటుతోపాటు 60 సీసీ కెమెరాలను బిగించారు. రద్దీని తెలుసుకొనేందుకు 3 -4 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు. మైదానంలో ఆరు వైద్య బృందాలు, మూడు అగ్నిమాపక శకటాలు, మరో మూడు బు/-లలెట్‌ శకటాలు, ్గ/ర్‌ కంట్రోల్‌ రూంలను అందుబాటులో ఉంచారు. మైదానంలోకి వచ్చినవారి సందేహాలను నివృత్తిచేయడం, బస్సులు, రైళ్ల రాకపోకల సమాచారాన్ని అందజేసేందుకు మే ఐ హెల్ప్‌ బూత్‌లను నెలకొల్పారు. చేప ప్రసాదం పంపిణీకి వచ్చేవారి కో సం గత ఏడాది వంద బస్సులు నడుపగా, ఈసారి హైదరాబాద్‌లోని 14 ట్రాఫిక్‌ హబ్‌ల నుంచి 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి 100 మొబైల్‌ టాయిలె ట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు వెయ్యిమందికిపైగా సిబ్బందిని కేటాయించారు.రోగులు, సహాయకుల కోసం రూ.5 భోజన కౌంటర్లు, బద్రివిశాల్‌ పన్నాలాల్‌ ట్రస్ట్‌, అగర్వాల్‌ట్రస్ట్‌, అగర్వాల్‌ సేవాదళ్‌, హైదరాబాద్‌ జైశ్వాల్‌సేవా సమితిలతో ఉచితంగా టిఫిన్లు, భోజనాలను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు.