చేరికలే లక్ష్యంగా బిజెపి వ్యూహం
పలువురు నేతలతో అంతర్గత చర్చలు
హైదరాబాద్,ఆగస్ట్17 జనంసాక్షి రాష్ట్రంలో బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ చేరికలే లక్ష్యంగా మరోమారు కార్యాచరణకు సిద్దం అవుతోంది. అలాగే జాతీయస్థాయి నేతలు దృష్టి పెట్టి పార్టీ లోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల నేతలతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరాలని కోరుతున్నారు. పార్టీలో చేరితే తగిన అవకాశాలు వస్తాయని హావిూలిస్తున్నారు. పెద్ద నేతలు పార్టీలోకి వస్తే పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది నేతలను కలిసి చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తూ.. బీజేపీలో చేరాలని కోరుతున్నారు. జాతీయ పార్టీ నేతలతోపాటు రాష్ట్ర పార్టీ అగ్ర నాయకత్వం ఇస్తున్న సూచనలను పాటిస్తూ ఆయా పార్టీ నేతలతో చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో కూడా మాజీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ కేడర్‌ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పార్లమెంట్ సీటు, స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లను గెలిచిన బీజేపీ నేతలు ప్రస్తుతం పార్టీ బలోపేతంపైన దృష్టిపెట్టారు. వచ్చే రెండు నెలల్లో ఏ పార్టీ నుంచి ఎవరు చేరుతారో తేలే అవకాశం ఉంది. తెలుగు తమ్ముళ్లు కూడా ఒక్కొక్కరుగా సైకిల్ దిగుతున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం అనంతరం నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వం బలహీనపడుతూ వచ్చింది. కార్యకర్తలున్నా దిశానిర్దేశం చేసే నాయకులు పార్టీని వీడుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులు డీలాపడుతున్నాయి. కీలక
నేతలు పార్టీ వీడుతుండటంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు కరువవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మరికొందరు పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఎన్నికలపై గురిపెట్టిన కొందరు టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్ లేదా బీజేపీ టికెట్ ఇస్తామని మాటిస్తే ఆయా పార్టీల కండువాలు కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చర్చ సాగుతోంది. మొత్తంగా బండి దిగిపోయాక కిషన్ రెడ్డి పగగ్గాలు చేపట్టాక పెద్దగా స్పందన రావడం లేదు.