చైనా 29.. అమెరికా 27..స్వర్ణాలతో ముందంజచరిత్ర సృష్టించిన జమైకా పరుగులవీరుడు పతకాల నమోదులో భారత్‌ వెనుకంజ

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే ఆటగాడిగా జమైకా దేశస్థుడు రికార్డు సృష్టించాడు. చరిత్రను తిరగరాశాడు. అతడే.. ఉసెన్‌ బోల్ట్‌. లండన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో బోల్ట్‌ స్వర్ణ పతాకాన్ని చేజిక్కించుకున్నాడు. మరో విచిత్రమేమిటంటే అదే దేశానికి చెందిన యోహాన్‌ బ్లేక్‌ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఇక మూడో స్థానంలో అమెరికాకు చెందిన జస్టిన్‌ గాట్లిన్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతను 2004 ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బోల్ట్‌ వంద మీటర్ల గమ్యానికి 9.63 సెక్లలో చేరుకుంటే, యోహాన్‌ బ్లేక్‌ 9.75 సెకన్లలోను, గాట్లిన్‌ 9.79 సెకన్లలోను చేరుకున్నారు.
లండన్‌లో ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభమై సోమవారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. ఆది నుంచి పతకాల పట్టికలో చైనా, అమెరికా అథ్లెట్లు పోటీలు పడుతూ ప్రధానంగా స్వర్ణ పతకాల్లో తొలి ఒకటి, రెండు స్థానాల్లో ఉండేందుకు పోటీలు పడుతున్నారు. మన దేశ అథ్లెట్లు వీరోచితంగా పోరాటం సాగించినప్పటికీ మూడు పతకాలనే కైవసం చేసుకున్నారు. వాటిల్లో ఒకటి రజతం కాగా మరో రెండు కాంస్య పతకాలు.. మొత్తం మూడు పతకాలు మాత్రమే సాధించారు. మరో వారం రోజుల్లో లండన్‌ క్రీడలు ముగియనుండడంతో ఒక్క స్వర్ణమైనా భారత్‌ అథ్లెట్లు సాధిస్తారా.. అన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. చిన్న దేశాల అథ్లెట్లు సైతం రాణిస్తుంటే మనవాళ్లు ఆయా క్రీడల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నప్పటికీ రజతం, కాంస్యలకే పరిమితమవుతుండడం పట్ల కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా మరో ఆరు రోజులు సమయం ఉన్నందున మన అథ్లెట్లకు బెస్టాఫ్‌లక్‌ చెబుదాం.
తాజాగా ఆదివారం నాటి ఫలితాల నేపథ్యంలో.. చైనా 29 స్వర్ణాలతోను, అమెరికా 27 స్వర్ణాలతోను తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చైనా 29 స్వర్ణాలు, 16 రజతాలు, 14 కాంస్యాలు.. మొత్తం 59 పతకాలు సాధించి అగ్రభాగాన నిలిచింది. అమెరికా 27 స్వర్ణాలు, 14 రజతాలు, 15 కాంస్యాలు.. మొత్తం 56 పతకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో బ్రిటన్‌ నిలిచింది. 16 స్వర్ణాలు, 10 రతజాలు, 10 కాంస్యాలు.. మొత్తం 36 పతకాలు సాధించింది. నాల్గో స్థానంలో దక్షిణ కొరియా అథ్లెట్లు నిలిచారు. 10 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్యాలు.. మొత్తం 20 పతకాలు సాధించారు. ఐదో స్థానంలో ఫ్రాన్స్‌ నిలిచింది. 8 స్వర్ణాలు, 7 రజతాలు, 9 కాంస్యాలు.. మొత్తం 24 పతకాలు సాధించింది. ఆరో స్థానంలో నిలిచిన జర్మని.. 5 స్వర్ణాలు, 10 రజతాలు, 7 కాంస్యాలు.. మొత్తం 22 పతకాలు గెలుచుకుంది. 5 స్వర్ణాలు, 5 రతజాలు, 3 కాంస్యాలు.. మొత్తం 13 పతకాలతో ఇటలి ఏడో స్థానంలో నిలిచింది. కజకిస్తాన్‌ అథ్లెట్లు మొత్తం 5 స్వర్ణాలు మాత్రమే సాధించారు. మొత్తం 5 స్వర్ణాలతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకు న్నారు. ఉత్తరకొరియా 4 స్వర్ణాలు, ఒక కాంస్యం.. మొత్తం 5 పతకాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రష్యా అథ్లెట్లు 3 స్వర్ణాలు, 16 రజతాలు, 15 కాంస్యాలు.. మొత్తం 34 పతకాలు సాధించి పదో స్థానంలో నిలిచారు. అలాగే నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు 3 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్యాలు.. మొత్తం 8 పతకాలతో పదకొండో స్థానంలో నిలిచారు. భారత్‌ది పన్నెండో స్థానం. ఒక రజతం, రెండు కాంస్యాలు.. మొత్తం 3 పతకాలు మాత్రమే సాధించింది.